జగిత్యాల రూరల్, నవంబర్ 21: చార్జింగ్ పెట్టిన కాసేపటికే ఎలక్ట్రిక్ బైక్ పేలిన ఘటన జగిత్యాల రూరల్ మండలంలోని బాలపల్లి గ్రామంలో గురువారం చోటు చేసుకున్నది. బాధితుడు బేతి తిరుపతిరెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మూడునెలల క్రితం ప్రముఖ కంపెనీకి చెందిన బ్యాటరీ బైక్‌ని కొనుగోలు చేయగా, రోజూవారిలాగే ఉదయం ఇంటి ఆవరణలో చార్జింగ్ పెట్టి పొలానికి వెళ్లాడు. కొద్దిసేపటికే బైక్ బ్యాటరీ పేలి మంటలు అంటుకున్నాయి. దీంతో బైక్‌తోపాటు డిక్కీలో ఉన్న రూ.1.40లక్షల నగదు కాలి బూడిదైంది. సమాచారం అందుకన్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. బైక్‌తోపాటు నగదు దగ్ధం కావడంతో న్యాయం చేయాలని తిరుపతిరెడ్డి వేడుకుంటున్నాడు.