హైదరాబాద్, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ): వరంగల్ వైద్య విద్యార్థిని డాక్టర్ ధరావత్ ప్రీతి మృతి ఘటనపై తీసుకున్న చర్యల నివేదికను సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కులం పేరుతో ర్యాగింగ్ చేయడంతోపాటు హత్య చేశారని ఆరోపిస్తూ తెలంగాణ ఎస్సీ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎం మల్లయ్య రాసిన లేఖను హైకోర్టు పిల్‌గా పరిగణించి మంగళవారం విచారణ జరిపింది. ప్రతివాదులైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి, డీఎంఈ, వరంగల్ పోలీస్ కమిషనర్, కేఎంసీ ప్రిన్సిపాల్, అనస్తీషియా విభాగాధిపతులకు నోటీసులు జారీ చేసింది. విచారణను జూన్ 28కి వాయిదా వేస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ తుకారాంజీతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది.