హైదరాబాద్,జూలై 22 (నమస్తేతెలంగాణ): చేపల సాగులో పెట్టుబడులను తగ్గించి అధిక దిగుబడులను ఇచ్చే మేలురకం చేపల రకాలను అభివృద్ధి చేయడంపై పాలేరు మత్స్య పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. పీవీ నరసింహారావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం పరిధిలోని మత్స్య పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు ఈ పరిశోధనలకు సహకరిస్తున్నారు. స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఆధునిక పద్ధతులపై చేపల పెంపకంలో మెరుగైన జీవనోపాధి కల్పించేందుకు ఖమ్మం జిల్లా పాలేరు మత్స్య పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. చెరువుల్లో పెంచుతున్న చేపలకు రోగాలు రావడం, వాటి ఎదుగుదలలో లోపం వంటి సమస్యలతో దిగుబడులు తగ్గి మత్స్యకారులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ సమస్యను ఎదుర్కొనేందుకు జన్యుపరంగా అభివృద్ధి చేసిన అమూర్ కామన్కార్స్ (బంగారు తీగ), జయంతి రోహో (రవ్వ), జీఐఐ కట్ల (బొచ్చ), జీఐఎఫ్‌టీ తిలాపియా, జీఐఐ స్కాంపి ప్రత్యామ్నాయ జాతులైన రూప్‌చంద్, పెరల్స్పాట్, మంచినీటి పండుగప్ప, రెట తిలాపియా రకాలపై పాలేరులో శాస్త్రవేత్తలు నిరంతరం పరిశోధనలు జరుపుతున్నారు. ఈ చేపలు ఇక్కడి వాతావరణానికి తట్టుకుంటాయా లేదా వ్యాధి నిరోధకశక్తి, మేత విధానం, పోషకాలు, అధిక దిగుబడులు వంటి వివిధ రకాలపై పరిశోధనలు చేస్తున్నారు.
తెలంగాణలో దొరికే సాధారణ బంగారు తీగ చేపల పొట్టలో అధికభాగం గుడ్లు ఉంటాయి. అమూర్ రకం చేపలో మాత్రం అండాశయం తక్కువగా ఉండి చేప సన్నగా, పొడుగ్గా ఉంటుంది. ఈ చేపలు ఆకర్షణీయమైన రంగుతో గుళికల వంటి మేతను తింటూ చాలా వేగంగా పెరుగుతాయి. రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉండటం వీటి ప్రత్యేకత. అమూర్ కామన్కార్ప్తోపాటు జయంతి రోహో, జీఐఎఫ్‌టీ తిలాపియా, స్కాంపి, జీఐఐ కట్ల వంటి సాధారణ రకాల్లో 15 శాతం అధిక ఎదుగుదల ఉంటుంది. పెట్టుబడి తక్కువ, ఇక్కడి వాతావరణ పరిస్థితులకూ తట్టుకుంటాయి. అధిక దిగుబడులు కూడా లభిస్తాయి. చిప్పల చేప (రూప్‌చంద్) నారింజ రంగులో ఉంటుంది. ఎదుగుదల అధికంగా ఉంటుంది. వీటికి సరైన ఆహారం మేతగా అందిస్తే నెలకు 100 నుంచి 150 గ్రాముల చొప్పున పెరుగుతాయి. 10 నెలల్లోనే అమ్మకానికి సిద్ధంగా ఉంటాయి.