వాషింగ్టన్ : అంతరిక్షంలో భారీ అద్దాలను ఏర్పాటు చేసి భూమిపై రాత్రిని పగలుగా మార్చేందుకు కాలిఫోర్నియాలోని స్టార్టప్ కంపెనీ రిఫ్లెక్ట్ ఆర్బిటాల్ ప్రయత్నిస్తున్నది. రిఫ్లెక్టివ్ ప్యానెల్స్‌తో కూడిన వేలాది ఉపగ్రహాలను ప్రయోగించి, భూమిపై రాత్రి సమయం గల ప్రాంతంలోకి సూర్యకాంతి పడేలా చేయాలన్నది ఈ కంపెనీ ఆలోచన. ప్రకృతి విరుద్ధమైన ఈ ప్రణాళిక వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయని చెప్తున్నది. సూర్య కాంతి వల్ల సోలార్ ప్యానెల్స్‌కు విద్యుత్తు అందుతుంది, సహాయ, ఇతర కార్యకలాపాలకు ఉపయోగపడుతుంది.
సూర్య కాంతి లేకపోవడం వల్ల వచ్చే సీజనల్ డిప్రెషన్ వంటి వాటికి చికిత్స చేయడం సాధ్యమవుతుంది. ఈ ప్రయోగాన్ని వచ్చే ఏడాది నుంచి ప్రారంభించాలని కంపెనీ ప్రయత్నిస్తున్నది. దీనికి అనుమతి ఇవ్వాలని అమెరికా ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్‌ను కోరింది. ఖగోళ శాస్త్రవేత్తలు ఈ ఆలోచనను ఇష్టపడటం లేదు. ఇది ప్రకృతి సహజ పరిస్థితులకు విరుద్ధమని చెప్తున్నారు. మనుషులు ఇటువంటి శక్తిమంతమైన శక్తిని నియంత్రించకూడదని అంటున్నా చెప్తున్నారు. ఇదిలావుండగా, స్పేస్ మిర్రర్స్ ఆలోచన కొత్తదేమీ కాదు. జర్మన్ రాకెట్ పయనీర్ హెర్మన్ ఒబెర్త్ 1923లో తన సిద్ధాంతంలో ఈ ప్రతిపాదన చేశారు. 80 అడుగుల అద్దంతో 1993లో రష్యన్ శాటిలైట్ జ్నామియా 2ను ప్రయోగించారు.