హైదరాబాద్ : మంత్రి కొండా సురేఖ ( Konda Surekha ) కుమార్తె కొండా సుస్మిత ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేపై చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీకి చెందిన 18 మంది ఎమ్మెల్యేలు( MLAs), ఎమ్మెల్సీ ( MLCs ) లు తీవ్రంగా ఖండించారు. మంత్రి కొండా సురేఖను తక్షణమే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ ( Expel Demand ) చేశారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు.
కొండా సురేఖ భాష ఎప్పుడూ పార్టీకి నష్టం కలిగించే విధంగానే ఉందని, కేటీఆర్, సమంత అంశంలో కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు కూడా పార్టీకి తలనొప్పిగా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీ సభ్యులు కానీ, అనామకులైన కొండా సుష్మిత కాంగ్రెస్ ఎమ్మెల్యేను పట్టుకొని అడ్డగోలుగా మాట్లాడుతుందని, ఇంతకంటే బజారు కల్చర్ ఎక్కడా ఉండదని పేర్కొన్నారు.
రేవంత్ రెడ్డి నిర్ణయాలను వ్యతిరేకిస్తున్న వాళ్లకి పార్టీలో ఉండే అర్హత లేదని స్పష్టం చేశారు. కొండా సురేఖకు నోటీసులు ఇస్తే, నా బిడ్డ మాటలకు నాకు సంబంధం లేదని బుకాయిస్తుందని ఆరోపించారు. సంబంధం లేకపోతే ముఖ్యమంత్రిపై కూతురు చేసిన వ్యాఖ్యలను ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు. మీరు మాట్లాడుతున్న తప్పుడు భాషకు కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి మూల్యం చెల్లిస్తున్నారని, మీరు మాత్రం మీ పదవిని ఎంజాయ్ చేస్తూ పార్టీని ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, చిన్నారెడ్డి ఎవరు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడినా కఠిన చర్యలు తీసుకోవాలని అధిష్టానాన్ని కోరనున్నట్లు వెల్లడించారు. రాజగోపాల్ రెడ్డి ఎగిరెగిరి పడుతున్నాడు. మునుగోడు ఉప ఎన్నికల్లో నీ గతి ఏమైందో తెలుసు కదా అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విమర్శించారు. ఏ పార్టీలో అయినా సక్రమంగా గొడవలు లేకుండా ఉన్నావా కొండా సురేఖ? ఒక్క ఎమ్మెల్యేతో అయినా మంచి సంబంధాలు ఉన్నాయా ? నీ బిడ్డ మాట్లాడుతుంటే వెనుక బ్యానర్లో నీ ఫోటో ఉంటది, నీకు నీ బిడ్డ వ్యాఖ్యలకు సంబంధం లేదు అనడం ఏంటి? అంటూ విమర్శలు చేశారు. ఇంకెన్ని రోజులు నీ బ్లాక్‌మెయిల్‌తో పాలిటిక్స్ నడిపిస్తావని దుయ్యబట్టారు.
పార్టీలోనే కొన్ని గుంట నక్కలు కొండా సురేఖ వెనకాల ఉన్నాయని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి రక్తం తాగింది చాలు పార్టీ నుంచి వెళ్లిపోవాలని కొండా సురేఖకు సూచించారు. పార్టీ బహిష్కరించక ముందే వెళ్లిపోతే మంచిదని హితవు పలికారు. మీడియా సమావేశంలో నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు, బీర్ల ఐలయ్య , మధుసూదన్ రెడ్డి , రేవూరి ప్రకాష్ రెడ్డి , దొంతి మాధవరెడ్డి, మందుల సామెల్ , వెడ్మ బొజ్జు , వేముల వీరేశం, బుయ్యని మనోహర్ రెడ్డి , కూచుకుళ్ల రాజేష్ రెడ్డి , బత్తుల లక్ష్మా రెడ్డి , బాలు నాయక్ , వీర్లపల్లి శంకర్ , కుంభం అనిల్ కుమార్ రెడ్డి , చిక్కుడు వంశీకృష్ణ ,బల్మూరి వెంకట్, బస్వరాజు సారయ్య, తదితరులు పాల్గొన్నారు.