హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): డ్రగ్స్హ్రిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో(టీఎస్-నాబ్) సేవలను వేగంగా విస్తరిస్తున్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ, వరంగల్ పోలీస్ కమిషనరేట్లలో నాలుగు ఠాణాల ఏర్పాటు, వాటికి డీఎస్పీ స్థాయి అధికారిని ఎస్‌హెచ్‌వోగా నియమిస్తూ మంగళవారం టీఎస్-నాబ్ డైరెక్టర్ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ ఠాణాకు
ఏసీపీ కే నర్సింగ్‌రావు, సైబరాబాద్‌కు హరిశ్చంద్రారెడ్డి, రాచకొండకు రమేశ్, వరంగల్‌కు సైదులును నియమించారు. హైదరాబాద్ మినహా మిగతా మూడు ఠాణాల పరిధిలోకి ఆయా చుట్టుపక్కల జిల్లాలు వస్తాయి.
నాలుగు ప్రత్యేక కోర్టులకు ప్రతిపాదనలు
మాదక ద్రవ్యాల కేసుల దర్యాప్తు, నిందితుల ఆస్తుల స్వాధీనం, విచారణలు ఆయా ఠాణాల పరిధిలోకి వస్తాయి. హైదరాబాద్ నార్కొటిక్ ఠాణా నాంపల్లిలోని పాత హైదరాబాద్ కమిషనరేట్ భవనంలో ఏర్పాటవుతుంది. మిగతా మూడు కమిషనరేట్లలో ఠాణా ఏర్పాటుకు స్థలాలను పరిశీలిస్తున్నారు. నార్కోటిక్స్ కేసుల విచారణకు నాలుగు ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు పంపారు. టీఎస్-నాబ్ డైరెక్టర్‌గా సీవీ ఆనంద్ నేతృత్వంలో నాలుగు నార్కోటిక్ ఠాణాలు, ఏడు రీజినల్ నార్కోటిక్ కంట్రోల్ సెల్స్, 26 నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్స్ పనిచేస్తాయి. ప్రస్తుతం ఠాణా ఏర్పాటు పూర్తికాగా మిగతా విభాగాల ఏర్పాటుకు కసరత్తు జరుగుతున్నది.