హైదరాబాద్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ): విద్యుత్తు సంస్థలకు ముఖ్యమైన జనరల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ సప్లయ్ (జీటీసీఎస్) నిబంధనలను మార్చేందుకు తెలంగాణ విద్యుత్తు నియంత్రణ మండలి (టీఎస్ఈఆర్సీ) కసరత్తును ముమ్మరం చేసింది. దీనిలో భాగంగా జీటీసీఎస్ క్లాజులను మార్చేందుకు బుధవారం ఓ ముసాయిదాను విడుదల చేసింది. దీనిపై వినియోగదారుల నుంచి సలహాలు, సూచనలను స్వీకరిస్తున్నది.
సెప్టెంబర్ 8 సాయంత్రం 5 గంటల్లోగా వినియోగదారులు హైదరాబాద్ రెడ్‌హిల్స్‌లోని ఈఆర్సీ కార్యాలయాన్ని సంప్రదించి అభిప్రాయాలను వెల్లడించవచ్చని, లేదా secy@tserc.gov.in ఈ-మెయిల్‌కు కూడా అభిప్రాయాలను పంపవచ్చని ఈఆర్సీ అధికారులు తెలిపారు. తమ కనెక్షన్ల సరఫరా సామర్థ్యాన్ని పెంచేందుకు జీటీసీఎస్ నిబంధనలను సవరించాలని హైటెన్షన్ (హెచ్‌టీ) విద్యుత్తు వినియోగదారులు కోరుతున్నారు. ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ పరిధిలోని నుంచి 11కేవీ, 33 కేవీ విద్యుత్తు వినియోగదారుల నుంచి పెద్ద సంఖ్యలో విజ్ఞప్తులు వచ్చాయి. దీంతో జీటీసీఎస్ నిబంధనల సవరణకు ఈఆర్సీ ముసాయిదాను విడుదల చేసింది.