హైదరాబాద్, ఏప్రిల్11(నమస్తే తెలంగాణ): ‘ఎక్సైజ్ శాఖ నిజామాబాద్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డిని అదే శాఖ కమిషనర్ దూర్భాషలాడి మూడు రోజులైనా ఎక్సైజ్ గెజిటెడ్ అధికారుల సంఘం ఎందుకు నోరు మెదపలేదు. సోమిరెడ్డికి జరిగిన అవమానంపై ఉద్యోగ, ప్రజా సంఘాలు ఆందోళనకు దిగుతున్న నేపథ్యంలో ఆ సంఘం హడావుడిగా లేఖ విడుదల చేయడంలో ఆంతర్యమేమిటి?’ అని ఆ శాఖలోని అధికారులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు మండిపడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న వేళ ఆ లేఖ బయటకొచ్చింది. ‘ఇది పూర్తిగా మా శాఖాపరమైన వ్యవహారం. ఇందులో ఎవరి జోక్యం అవసరం లేదు’ అంటూ లేఖ విడుదల చేశారంటూ భగ్గుమంటున్నారు.
సంక్షోభ సమయంలో బాధిత అధికారికి అండగా నిలబడి నైతిక మద్దతును ఇవ్వాల్సిన ఎక్సైజ్ గెజిటెడ్ అధికారుల సంఘం నేతలు ఈ తరహా లేఖను మీడియాకు విడుదల చేయటంపై ఆ శాఖ అధికారులే విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అదే ఎక్సైజ్ గెజిటెడ్ అధికారుల సంఘం సభ్యుడైన సోమిరెడ్డి మూడురోజుల క్రితం తీవ్ర అస్వస్థతతో దవాఖాన పాలైతే ఆ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు సంఘటనపై కనీసం మాట్లాడకుండా మౌనంగా ఉండటం, విషయాన్ని బయట పెట్టకుండా ఉండటమే క్షమించరాని తప్పిదమని అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటనపై స్పందించిన ఉద్యోగ సంఘాలనే తప్పుబట్టడంపై ఆగ్రహావేశాలు వ్యక్తంచేస్తున్నారు. ఎవరి ప్రయోజనాలు ఆశించి, ఎవరి ఒత్తిడి మేరకు ఈ ప్రకటన విడుదల చేశారో? చెప్పాలని ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.
పుండుపై కారం చల్లినట్టుగా లేఖ విడుదల
‘కమిషనర్ దుర్భాష కంటే సహచర అధికారులు మౌనంగా ఉండటమే తనను తీవ్రంగా బాధించింది. 30 ఏండ్లు ఇటువంటి చేతగాని, చేవలేని శాఖలో పని చేసినందుకు సిగ్గుతో తలదించుకుంటున్నా’ అని బాధిత అధికారి సోమిరెడ్డి దవాఖాన నుంచి విడుదల చేసిన లేఖలో భావోద్యేగాన్ని వ్యక్తంచేశారు. ఈ సమయంలో పుండు మీద కారం చల్లినట్టుగా శనివారం రాత్రి ఎక్సైజ్ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు, మెదక్ డివిజన్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ జే హరికిషణ్ ఒక లేఖను మీడియాకు విడుదల చేశారు.
ఈ లేఖలో ఆయన ఒక్కరి సంతకమే ఉన్నది. నిజామాబాద్ డిప్యూటీ కమిషనర్ ఘటనలో వివిధ పార్టీల నాయకులు ఇచ్చిన స్టేట్మెంట్కు ఎక్సైజ్ శాఖకు ఎటువంటి సంబంధం లేదని ఆ లేఖలో పేర్కొన్నారు. తాము సమస్యను ఏ రాజకీయ నాయకుల దృష్టికి గానీ, పార్టీల దృష్టికి గానీ, సంఘాల దృష్టికి గానీ తీసుకెళ్లలేదని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా తమ ఉద్యోగ సంఘాలు, టీజీవో, టీఎన్జీవో సంఘాల ద్వారా ఈ సమస్యను తామే పరిషరించుకుంటామని, ఇందులో బయటి వ్యక్తులు, శక్తులు, సంఘాలు కలుగజేసుకోవాల్సిన అవసరం లేదని హరి కిషన్ తన లేఖలో పేర్కొన్నారు. లేఖ చివరలో మాత్రం ‘సోమిరెడ్డికి జరిగిన విషయంలో మేము ఖండిస్తున్నాం. మరొకరికి ఇలా జరగవద్దని కోరుకొంటున్నాం’ అంటూ ముక్తసరి వ్యాఖ్యలతో ముగించారు.
తెలిసీ.. మౌనం దాల్చి!
ఎక్సైజ్ శాఖ కమిషనర్ దుర్భాషలతో మనోవేదనకు గురైన డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి కుప్పకూలి పడిపోయిన సంఘటన ఎక్సైజ్ గెజిటెడ్ అధికారుల సంఘం నేతల సమక్షంలోనే జరిగింది. ఇది జరిగి మూడు రోజులవుతున్నది. సోమిరెడ్డి చికిత్స పొందుతున్న దవాఖానకు ఆ నేతలు వెళ్లి వచ్చారు. ఆయన ఆవేదనను స్వయంగా విన్నారు. కానీ ఒక్కరంటే ఒక్కరు కూడా నోరు మెదపలేదు. కనీసం కమిషనర్ వైఖరిపై తమ అసంతృప్తిని వ్యక్త పరుచలేదు. ‘ఇది సహజమేనని మీరే తొందర పడుతున్నారు’ అని బాధిత అధికారినే దబాయించే ప్రయత్నం చేశారు. కానీ జరిగిన ఘటన మీడియా ద్వారా బయటికొచ్చి తెలంగాణ ఉద్యోగ సంఘాలు, ప్రజా సంఘాలు రంగంలోకి దిగి నిరసనలు చేపట్టిన నేపథ్యంలో ‘ఇది మా సొంత విషయం’ అంటూ ఎక్సైజ్ గెజిటెడ్ అధికారుల సంఘం బయటికి రావటంపై ఆ శాఖ అధికారులే తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. అసోషియేషన్ పక్షాన ఒకే ఒక్కరు నిర్ణయం తీసుకొని, లేఖపై కనీసం జనరల్ సెక్రటరీ అభిప్రాయం కూడా లేకుండా ఏకపక్షంగా మీడియాకు లేఖ విడుదల చేసినట్టుగా ఉన్నదనే అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. సంఘం నేతలుగా ఎన్నుకొన్నది వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదని, సహచర అధికారి ప్రాణాపాయంలో ఉన్నప్పుడు ఎవరినో రక్షించడానికి అన్నట్టు స్టేట్మెంట్ ఇవ్వడం సరికాదని ఉద్యోగ సంఘాల నాయకులు మండిపడుతున్నాయి.