హైదరాబాద్, సెప్టెంబర్12 (నమస్తే తెలంగాణ): ప్రతి మద్యం దుకాణంలో వారం రోజులకు సరిపడా మద్యం నిల్వలు ఉండాల్సిందేనని ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్ మౌఖిక ఆదేశాలు జారీచేశారు. గ్రౌండ్ స్టాక్ నిర్వహించని దుకాణాలపై ఎన్ఫోర్స్ మెంట్, ఎస్టీఎఫ్ బృందాలతో దాడులు చేయిస్తామని హెచ్చరించినట్టు తెలిసింది. ‘నకిలీ మద్యం దందా.. నెలకు రూ.200 కోట్లు’ శీర్షికతో శుక్రవారం నమస్తే తెలంగాణలో ప్రచురితమైన కథనానికి ఎక్సైజ్‌శాఖ స్పందించింది.
మద్యం దుకాణాల లైసెన్స్ గడువు దగ్గరపడటం, ప్రివిలేజ్ ఫీజులతో లాభాలు రాకపోవడంతో వ్యాపారులు నకిలీ మద్యం వైపు చూస్తున్నారనే విషయం వెలు గులోకి రావడంతో ఎక్సైజ్‌శాఖలో కదలిక మొదలైంది. ఎక్సైజ్ కమిషనర్ క్షేత్రస్థాయి నుంచి వాస్తవాలను తెలుసుకున్నారని, అందుకే గ్రౌండ్ స్టాక్ నిబంధనను అమల్లోకి తెచ్చారని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ఒక మద్యం దుకాణంలో నిరుడు సెప్టెంబర్‌లో జరిగిన విక్రయాలను బట్టి వాటికి అదనంగా పది శాతం మద్యం జోడించి గ్రౌండ్ స్టాక్‌ను నిర్ధారించాలని ఆయా జిల్లాల ఎక్సైజ్ అధికారులకు దిశా నిర్ధేశం చేసినట్టు తెలిసింది.