హైదరాబాద్, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ) : ములుగు జిల్లాలోని ఓ కాలేజీలో పరీక్షలు ఎలా జరుగుతున్నాయి. ఏవైనా తప్పిదాలు జరుగుతున్నాయా..? పేపర్ లీకేజీ వంటివి జరుగుతున్నాయా..? అని తెలియాలంటే ఇది వరకు అధికారులు ప్రత్యక్షంగా వెళ్లాల్సి వచ్చేది. ఆకస్మిక తనిఖీలు జరపాల్సి వచ్చేది. కానిప్పుడు ఒకే ఒక్క క్లిక్‌తో పరీక్ష ఎలా జరుగుతుందన్నది ఇట్టే తెలిసిపోతుంది. అనుమానాస్పద వ్యక్తులను వెంటనే గుర్తించవచ్చు. ఇలాంటి అత్యాధునిక కమాండ్ కంట్రోల్ సెంటర్(సీసీసీ)ను ఇంటర్‌బోర్డు అందుబాటులోకి తీసుకొచ్చింది. పరీక్షల సంస్కరణల్లో భాగంగా ఈ సెంటర్‌ను నాంపల్లిలోని బోర్డులో ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా గల ప్రభుత్వ, ప్రైవేట్ అన్న తేడాల్లేకుండా అన్ని కాలేజీల్లో ఇప్పటికే 8వేల సీసీ కెమెరాలు బిగించారు. ప్రస్తుతం ప్రాక్టికల్స్ నేపథ్యంలో ల్యాబుల్లో వీటిని ఏర్పాటు చేశారు. మార్చి 5 నుంచి జరిగే థియరీ పరీక్షల పర్యవేక్షణకు మెయిన్‌గేట్, కారిడార్, చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ అధికారులుండే చోట వీటిని బిగించారు. వీటిని సీసీసీతో అనుసంధానించి, ఒకేసారి అన్ని సీసీ కెమెరాలు వీక్షించేలా ఏర్పాట్లు చేశారు. సీసీసీని విద్యాకమిషన్ సందర్శించింది.