హైదరాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ) : బీసీ కులగణన వెంటనే చేపట్టాలని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు పెంచాకే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని అఖిలపక్ష సమావేశంలో ఏకగ్రీవ తీర్మా నం చేశారు. గురువారం హైదరాబాద్ సెంట్రల్ కోర్టులో ‘బీసీల సమగ్ర కులగణన-స్థానిక ఎన్నికలకు ముందే బీసీలకు 42శాతం రిజర్వేషన్లు’ అంశంపై నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. ఈ సందర్భంగా మండలి బీఆర్ఎస్ఎల్పీ నేత మధుసూదనాచారి మాట్లాడుతూ.. బీసీల ఐక్యతను దేశానికి చాటిచెప్పాల్సిన సమయం ఆసన్నమైందని అభిప్రాయపడ్డారు.
కులగణన బీసీల హక్కు అని పేర్కొన్నారు. బీసీల డిమాండ్ల సాధన కోసం బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో బీసీలకు ఇచ్చిన మాటను తుంగలో తొక్కిన కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ డిమాండ్ల సాధన కోసం ఉద్యమకార్యాచరణ రూపొందించుకోవాలని నిర్ణయించారు. మాజీ మంత్రి శ్రీనివాసగౌడ్ మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా బీసీలకు అన్యాయమే జరుగుతుందని పేర్కొన్నారు. దేశంలో వేల సంఖ్యలో బీసీ కులాలు ఉన్నాయని, వాటిలో ఎన్నో కులాలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం లేని పరిస్థితులను మనం చూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
త్వరలో జరిగే మంత్రివర్గ విస్తరణలో బీసీలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. వచ్చే స్థానిక ఎన్నికల్లోగా బీసీ కులగణన పూర్తిచేయడంతోపాటు 42శాతం రిజర్వేషన్ల విధానం పాటించాలని, లేకుంటే ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి తమ హక్కులను కాపాడుకునేందుకు బీసీలంతా కదిలిరావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో సమగ్ర కులగణన చేపట్టి స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేసి తీరాల్సిందేనని బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాసగౌడ్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.