ఊరి అభివృద్ధి కోసం ఉన్న భూమిని అమ్ముకున్నారు. చేసిన అప్పులు తీర్చలేక సొంత ఇంటినీ వదులుకున్నారు. చివరికి నిలువ నీడ లేక సర్కారు బడిలో తలదాచుకుంటున్నారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం మైసమ్మవాగు పంచాయతీ మాజీ సర్పంచ్ సందెబోయిన లావణ్య కుమార్‌కు ప్రభుత్వం నుంచి రూ.10 లక్షల బిల్లులు రావాల్సి ఉన్నది. కాంగ్రెస్ సర్కారుకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా రూపాయి కూడా ఇవ్వకపోవడంతో మాజీ సర్పంచ్ కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడి బిక్కుబిక్కుమంటూ పాఠశాల గదిలో బతుకుతున్నది.
– అక్కన్నపేట, జూలై 26
అక్కన్నపేట, జూలై 26: ఆమె ఒక గ్రామానికి మాజీ సర్పంచ్. ఏడాది కిందటి వరకు ప్రజాప్రతినిధిగా గౌరవంగా బతికారు. కొత్తగా ఏర్పడిన గ్రామం, మొదటిసారి జరిగిన ఎన్నికల్లో ప్రజలు తనను నమ్మి ఓటేసినందుకు ఎలాగైనా అభివృద్ధి చేయాలని తపించారు. రెండు ఎకరాల భూమిని, ఇంటిని అమ్ముకొని మరీ పనులు చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వ నిర్వాకంతో ఆమె ఇప్పుడు గూడు లేక తాత్కాలికంగా బడిలో తలదాచుకుంటున్నారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోని మైసమ్మవాగు పంచాయతీ మాజీ సర్పంచ్ సందెబోయిన లావణ్య కుమార్ దీనస్థితి ఇది.
కాంగ్రెస్ ప్రభుత్వ కాఠిన్యానికి బలవుతున్న మాజీ సర్పంచ్ల జీవితాలకు ఇదొక ఉదాహరణ. మైసమ్మవాగు పంచాయతీ కొత్తగా ఏర్పడగా, రంగన్నకుంటకు చెందిన సందెబోయిన లావణ్య సర్పంచ్‌గా పోటీచేసి ఎన్నికల్లో గెలిచారు. అప్పటి నుంచి గ్రామాభివృద్ధి కోసం అహర్నిషలు కృషిచేశారు. గ్రామంలో అభివృద్ధి పనులు చేసేందుకు తన రెండెకరాల భూమితోపాటు శిథిలావస్థలో ఉన్న పెంకుటిల్లును సైతం అమ్ముకున్నారు. ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో రూ.10 లక్షలు బకాయి పడిపోయాయి. ఇల్లు, పొలం పోయి, బిల్లు రాక ఆ కుటుంబం ఆగమైంది.
లావణ్య కుటుంబం కొంతకాలం కుందన్వానిపల్లిలోని ఓ ఇంట్లో కిరాయి ఉండగా, అత్యవసర కారణాలతో ఆ ఇల్లును ఖాళీ చేయాల్సి వచ్చింది. ఎక్కడ ఉండాలో తెలియక రంగన్నకుంటలో మూతబడిన ప్రభుత్వ పాఠశాల భవనంలో నివాసం ఉంటున్నారు. గ్రామాభివృద్ధి కోసం వెచ్చించిన రూ.10 లక్షల బిల్లులు ఇప్పించి, ఆదుకోవాలని కోరినా పట్టించుకునేనాథులే లేరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పెండింగ్ బిల్లులు ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం తన జీవితాన్ని ఆగం చేస్తే, స్థానిక కాంగ్రెస్ నాయకులు కక్షపూరితంగా వ్యవహరిస్తూ మరింత వేధిస్తున్నారని లావణ్య ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఊరుబాగు కోసం ఇల్లు అమ్ముకున్న తనకు కనీసం ఇందిరమ్మ ఇల్లు కూడా మంజూరు కాకుండా అడ్డుకుంటున్నారని వాపోయారు. అర్హుల జాబితాలో తన పేరు ఉన్నా, ఇల్లు మంజూరు కాకుండా స్థానిక కాంగ్రెస్ నాయకులు అడ్డుకుంటున్నారని చెప్పారు. అధికారులు సైతం వారికే మద్దతు పలుకుతున్నారని ఆరోపిస్తున్నారు. ఎంపీడీవోను కలిసి ఎన్నిసార్లు వేడుకున్నా ఫలితం లేదని తెలిపారు.