నమస్తే తెలంగాణ నెట్వర్క్, అక్టోబర్ 12 : ‘ఇది మా నాయకుడి ఇలా కా.. ఇక్కడ మా నాయకుడి అనుమతి లేనిదే చీమ కూడా కదలడానికి వీల్లే దు.. మమ్మల్ని కాదని ఎవరైనా తుమ్మి ళ్ల రీచ్ నుంచి ఇసుక తరలిస్తే మీ అంతు చూస్తాం.. ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి.. ఇక్కడ మా నాయకుడు చెప్పిందే వేదం.. ఆయనను కాదని మొండిగా ప్రవర్తిస్తే టిప్పర్ల టైర్లు కోస్తాం’ అంటూ జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గానికి చెందిన ఓ మాజీ ప్రజాప్రతినిధి అనుచరులు ఇసుక రీచ్ పొందిన టెండర్‌దారులను భయభ్రాంతులకు గురి చేసినట్టు తెలిసింది. వివరాల్లోకి వెళ్తే.. జోగుళాంబ గద్వాల జిల్లా రాజోళి మండలం తుమ్మిళ్ల దగ్గర ప్రభుత్వం ఆగస్టులో ఇసుక రీచ్‌లు ఏర్పాటు చేసింది. ఏపీ లోని రాజమండ్రికి చెందిన గుత్తేదారు టీజీ టీఎండీసీ, ఇందిరమ్మ ఇండ్లకు ఇసుక సరఫరా చేయడానికి టెండర్ దక్కించుకున్నారు.
ఇది అలంపూర్‌కు చెందిన అధికార పార్టీ నేతకు రుచించడంలేదు. టెండర్ ఆంధ్రాప్రాంతం వారికి దక్కక ముందు ఇసుక మాఫి యా అంతా ఆ అధికార పార్టీ నేత కనుసన్నల్లోనే నడిచింది. అప్పుడు జిల్లా అంతటా ఆయన అనుచరులే ఇసుక సరఫరా చేసేవారు. ఆ నేతకు ఇటు జిల్లా అధికారులతోపాటు అటు మై నింగ్ అధికారులు పూర్తిస్థాయిలో సహకరించడంతో ఆయన అనుచరుల వ్యా పారం ఎటువంటి అడ్డంకులు లేకుండా సాగింది. ఇసుక సరఫరా నిలిపివేస్తే కాంట్రాక్టర్ సదరు నేత దగ్గరకు వచ్చి సెటిల్మెంట్ చేసుకుంటాడనే ఆలోచనతో ఇసుక వాహనాలు నడవకుండా అడ్డుకుంటున్నట్టు తెలుస్తుంది. ఈ విషయం సదరు కాంట్రాక్టర్ జిల్లా ఉన్నతాధికారులకు తెలియజేసినా వారు అధికార పార్టీ నేతకు సహకరించడంతో ఏం చేయాలో తోచక ఇసుక సరఫరాను నిలిపివేసినట్టు తెలిసింది. దీంతో మూడు రోజులుగా రీచ్ నుంచి ఇసుక బయటకు రావడంలేదు.