హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల్లోనే ఎన్కౌంటర్లు ఎక్కువగా జరుగుతున్నాయని బీఆర్ఎస్ నేత జీ దేవీప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డి విమర్శించారు. గత పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఒకటి రెండు మినహా ఎన్కౌంటర్లు జరగనేలేదని చెప్పారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ప్రజా సమస్యలపై మాజీ మంత్రి హరీశ్‌రావు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారని, రాష్ట్రంలో శాంతిభద్రతల అంశంపై ఆయన మాట్లాడారని తెలిపారు. పోలీసు వ్యవస్థను ప్రభుత్వం కుప్పకూల్చిందని అన్న హరీశ్ వ్యాఖ్యలను పోలీసు అధికారులు తప్పుగా అర్థం చేసుకున్నారని దేవీప్రసాద్ తెలిపారు. పోలీసులు, పోలీసు అధికారుల పట్ల తమకు గౌరవం ఉన్నదని, హరీశ్‌రావు నిరంతరం ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యల పట్ల స్పందిస్తున్నారని చెప్పారు. కొందరు పోలీసు అధికారులు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారని తెలిపారు. ఖమ్మంలో వరద ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్న నలుగురు మాజీ మంత్రుల బృందంపై దాడులు జరిగాయని, ఈ ఘటనపై పోలీసులు కనీసం స్పందించనేలేదని, ఆ పర్యటనలో హరీశ్‌రావు కూడా ఉన్నారని పేర్కొన్నారు.
గత పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో సీఎంగా కేసీఆర్ పోలీసుశాఖలో అనేక సంసరణలను అమలు చేశారని గుర్తుచేశారు. పోలీస్స్టేషన్లకు స్టేషనరీ ఖర్చులు ఇచ్చిన ఘనత కేసీఆర్‌కే దకుతుందని తెలిపారు. పోలీసులకు కొత్త ఇన్నోవాలు ఇచ్చారని, 47 వేల మంది పోలీస్ కానిస్టేబుళ్ల నియామకం బీఆర్ఎస్ హయాంలోనే జరిగిందని, శాంతిభద్రతల వైఫల్యం ప్రభుత్వ వైఫల్యంగా భావిస్తున్నామని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉపాధ్యాయ అవార్డుల్లో పారదర్శకత లేదని పాతూరి సుధాకర్‌రెడ్డి విమర్శించారు. ప్రతి జిల్లా నుంచి నలుగురు చొప్పున ఎంపిక చేయాలని, దానిని విస్మరించారని తెలిపారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక గురుకుల పాఠశాలల స్థాయిని పెంచగా, నేడు కాంగ్రెస్ హయాంలో గురుకుల పాఠశాలలను పట్టించుకోవడమే లేదని తెలిపారు. తెలంగాణలో 194 ఆదర్శ పాఠశాలలను ఏర్పాటు చేశామని, వాటిని ప్రభుత్వ పాఠశాలలుగా మార్చాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు శాంతిభద్రతల సమస్య రానీయొద్దని కోరారు. ప్రభుత్వ విధానం ప్రకారమే పోలీసులు నడుచుకుంటారని తెలిపారు. రైతు భరోసా ప్రస్తావనే లేకుండా పోయిందని, ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇవ్వడమే లేదని, కాంగ్రెస్ నేతలు గాలి మాటలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.