హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ): ‘ముందు ఎమ్మెల్యేగా గెలవాలి.. ఆ తర్వాతే ముఖ్యమంత్రి అయితరు’.. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇవి. రెండు రోజుల క్రితం కొడంగల్ నియోజకవర్గం బొంరాస్‌పేటలో నిర్వహించిన సభ అట్టర్‌ఫ్లాప్ అయ్యింది. తాజాగా శనివారం అక్కడే రేవంత్ నిర్వహించిన రోడ్‌షోకు ప్రజల నుంచి ఆశించిన స్పందన రాలేదు. ఈ రోడ్‌షోకు హాజరైన మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి.. జనం లేకపోవడాన్ని గమనించి మనసులో మాట బయటపెట్టారు.
‘తక్కువ జనం ఇక్కడే కనిపిస్తున్నరు.. ఎందుకు రాలేదు.. కూళ్లకు పోయినరా? చేలు కోస్తున్నరా? వరి చేన్లు ముఖ్యంగానీ రేవంత్‌రెడ్డి వచ్చేది ముఖ్యం కాదన్నమాట.. అట్లయితే ఇక్కడ నువ్వెందుకు? నేనెందుకు? మనిద్దరం లేకపోతే నడవదా? ఒక సూచన చేస్తున్న. రేవంత్‌రెడ్డిని ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నరు కదా.. ఎమ్మెల్యే కానిది సీఎం ఎట్లయితడు? చదువుకున్నవు కదా, ముందు ఎమ్మెల్యేగ గెలవాలి కదా. అప్పుడే ముఖ్యమంత్రి అయితరు’ అని ప్రజా క్షేత్రంలోని వాస్తవ పరిస్థితులను చెప్పారు. ముఖ్యంగా రేవంత్, ఆయన అనుచరులు ‘రేవంత్ సీఎం’ అంటూ నినాదాలు చేయడంపై గుర్నాథరెడ్డి ఈస్థాయిలో చురకలు అంటించడంతో ఆయన వర్గీయుల్లో నోటి మాట లేదు.