హనుమకొండ, నవంబర్ 11 : మాయ మాటలు చెప్పి బీసీల ఓట్లతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వారికే అన్యాయం చేస్తున్నదని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ విమర్శించారు. సోమవారం మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డితో కలిసి హనుమకొండ బాలసముద్రంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఆదివారం హనుమకొండకు వచ్చిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై స్థానిక కాంగ్రెస్ నాయకులు అవాకులు, చెవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. తాము, తమ నాయకుడు తెలంగాణ కోసం జైలుకు వెళ్లినట్టు తెలిపారు.
కాంగ్రెస్ నాయకులు ఎందుకు వెళ్లారో ప్రజలకు తెలుసని అన్నారు. అవినీతి, అక్రమాలకు కేరాఫ్ కాంగ్రెస్ పార్టీ అని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రకటించిన కామారెడ్డి డిక్లరేషన్‌ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలకిచ్చిన 420 హామీలు, 6 గ్యారెంటీల అమలు, బీసీలకు ఇచ్చిన వరాల విషయంలో ప్రజల తరపున ప్రతిపక్ష పార్టీగా అడగడంలో తప్పేముందని ప్రశ్నించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌కు మంగళం పాడాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తున్నదని దుయ్యబట్టారు. అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి వ్యక్తిగత దూషణలు, దాడికి దిగుతున్నాడని మండిపడ్డారు.
ప్రశ్నిస్తే మూసీలో కలిపేస్తాం.. బుల్డోజర్లతో తొకిస్తాం అంటూ చిల్లర మాటలు మాట్లాడున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజలు కాంగ్రెస్ పాలనను, సీఎం, మంత్రులు, నాయకుల మాటలను గమనిస్తున్నారని అన్నారు. ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ప్రజల పక్షాన పోరాటం చేస్తుందని చెప్పారు. కేసులు పెడతాం, అరెస్టులు చేస్తాం లాంటి బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. పార్టీ ఆఫీసు వ్యవహారం కోర్టు పరిధిలో ఉన్నప్పటికీ దానిపై మాట్లాడుతున్నారని, కూల్చాలనుకుంటే కూల్చండని, తాము సహనంతో ఉన్నామని, రెచ్చగొట్టొద్దని హెచ్చరించారు. ఇంటింటి సర్వే చేస్తున్న క్రమంలో అధికారులను ప్రజలు తిడుతున్నారని తెలిపారు. 2014లో సమగ్ర కుటుంబ సర్వేపై రేవంత్‌రెడ్డి మాట్లాడిన వీడియోను మీడియా ముందు ప్రదర్శించారు. వివరాల సేకరణపై అప్పుడొక మాట, ఇప్పుడొక మాటను సీఎం మాట్లాడుతున్నాడని మండిపడ్డారు.