హైదరాబాద్, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ) : ‘ఎవరి లాభం కోసం మూసీ ప్రక్షాళన? రాష్ట్రంలో ఏ సమస్యలు లేన్నట్టు ఈ మూసీ రాగం ఎందుకు? ఢిల్లీకి డబ్బుల మూటలు మోసేందుకేనా? 51 కిలోమీటర్లు ఉన్న రివర్ అభివృద్ధికి రూ.1.50 లక్షల కోట్లు ఎందుకు?’ అని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి ప్రశ్నల వర్షం కురిపించారు. గురువారం మూసీపై సీఎం రేవంత్ మాట్లాడిన మాటలు పూర్తిగా సత్యదూరమని ఒక ప్రకటనలో ఖండించారు.
సీఎంకు చిత్తశుద్ధి ఉంటే మూసీ రివర్ బెడ్లోని ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలోని ఇండ్లు, వారికిచ్చే పరిహారంపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మూసీ సుందరీకరణ పేరిట సీఎం రేవంత్ పేదల కష్టార్జితాన్ని నేలపాలు చేస్తున్నాడని విమర్శించారు. పునరావాసం పేరిట మూసీ బాధితులకు కేసీఆర్ కట్టిన డబుల్ బెడ్రూం ఇండ్లను ఇస్తున్న నువ్వు.. కొత్తగా వారికి ఇచ్చింది ఏంటి? అని నిలదీశారు.
మొదట రూ.1.50 లక్షల కోట్లతో మూసీని సుందరీకరిస్తామని చెప్పిన రేవంత్, ఇప్పుడు మాట మారుస్తున్నారని విమర్శించారు. 371 కిలోమీటర్లు ఉన్న సబర్మతి రివర్ ఫ్రంట్‌కు రూ.1,400 కోట్లు, 2500 కిలో మీటర్లు ఉన్న నమామి గంగేకు రూ.25 వేల కోట్లు వెచ్చిస్తే, 51 కిలో మీటర్లు ఉన్న మూసీ ప్రక్షాళనకు రూ.1.50 లక్షల కోట్లు ఎందుకు? అని నిలదీశారు. ‘మూసీ పరీవాహక ప్రాంతంలో ఒక్క మట్టిపెళ్ల కూడా తీయలేదంటున్న నీకు.. ఇండ్లు కూలిన పేదల శాపనార్థాలు వినపడతలేవా’ అని ప్రశ్నించారు. మాజీ సీఎం కేసీఆర్‌ను తిట్టకుంటే రేవంత్‌కు పూటగడవదని ఎద్దేవా చేశారు.
పదవి పోతుందనే అభద్రతా భావంతోనే ఆయన ఇలా వ్యవహరిస్తున్నట్టు పేర్కొన్నారు. కేటీఆర్ పేదల పక్షాన మాట్లాడుతూ భరోసా ఇస్తుంటే, తట్టుకోలేని సీఎం ప్రెస్‌మీట్ పెట్టి నీతివాక్యాలు వల్లిస్తున్నారని విమర్శించారు. సీఎం రేవంత్ బెదిరింపులకు బీఆర్ఎస్ భయపడబోదని తేల్చిచెప్పారు. మూసీ బాధితులకు అండగా ఉండి రేవంత్ దోపిడీని అడ్డుకుంటామని స్పష్టంచేశారు.