హైదరాబాద్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ) : కామారెడ్డి డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీ మేరకు వైన్స్ టెండర్లలో గౌడన్నలకు 25 శాతం వాటా ఇవ్వాల్సిందేనని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. పాత పద్ధతిలోనే 15 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయించడం దుర్మార్గమని మండిపడ్డారు. ఈ నెల 14న జీవోలు ఇచ్చి గోప్యంగా ఉంచడం ఎందుకని ప్రశ్నించారు. పాపన్న విగ్రహావిష్కరణ సందర్భంగా ఈ విషయాన్ని ప్రస్తావించకపోవడంలోని అంతర్యమేమిటని నిలదీశారు. వెంటనే జీవో 93ను రద్దు చేయాలని, రూ.3 లక్షల లైసెన్స్ ఫీజును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే పోరాట కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. తెలంగాణభవన్‌లో గురువారం బీఆర్ఎస్ నేతలు పల్లె రవికుమార్‌గౌడ్, నాగేందర్‌గౌడ్, కిశోర్గౌడ్తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. నాడు ఓట్ల కోసం రాహుల్, ప్రియాంక, ఖర్గేలను తీసుకొచ్చి అడ్డగోలు హామీలిచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు దగా చేస్తున్నదని శ్రీనివాస్‌గౌడ్ దుయ్యబట్టారు. గీత కార్మికులకు మద్యం దుకాణాల్లో 25 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని, మరణించిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారమిస్తామని చెప్పి నట్టేట ముంచుతున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. 21 నెలల కాంగ్రెస్ పాలనలో 300 మంది మరణించినా నయాపైసా పరిహారం ఇవ్వలేదని ఆరోపించారు. 42 శాతం బీసీ కోటా అంశాన్ని కేంద్రం కోర్టులోకి నెట్టి తప్పించుకుంటున్న ప్రభుత్వం కనీసం తన పరిధిలో ఉన్న వాటినైనా ఎందుకు అమలు చేయడంలేదని నిలదీశారు. కేసీఆర్ పాలనలో వైన్స్‌ల్లో గీత కార్మికులకు 15 శాతం ఇచ్చిన కోటాను 30 శాతానికి పెంచాలని, గీత సొసైటీలకు ప్రాధాన్యమివ్వాలని నిర్ణయించారని గుర్తుచేశారు. ఆయన హయాంలో నందనంలో అన్ని హంగులతో నిర్మించిన ఈత, తాటి ఉత్పత్తుల కేంద్రాన్ని కూడా ప్రారంభించకపోవడం సిగ్గుచేటని విమర్శించారు.
కాంగ్రెస్ అంటేనే మోసానికి కేరాఫ్ అని పల్లె రవికుమార్‌గౌడ్ విమర్శించారు. ఓట్ల కోసం అలవికాని హామీలిచ్చిన ప్రభుత్వం ఇప్పుడు నయవంచనకు పాల్పడుతున్నదని మండిపడ్డారు. పాపన్న విగ్రహ ఏర్పాటుకు కేసీఆర్ ట్యాంక్‌బండ్‌పై రెండువేల గజాల స్థలాన్ని కేటయించారని గుర్తుచేశారు. కానీ హస్తంపార్టీ 700 గజాలకు కుదించి పోరాట యోధుడిని అవమాన పరిచిందని అన్నారు.
వైన్స్‌ల కేటాయింపులో గీత కార్మికులకు వాటా ఇవ్వకుంటే టెండర్ ప్రక్రియను అడ్డుకుంటామని శ్రీనివాస్‌గౌడ్ హెచ్చరించారు. ఇచ్చిన వాగ్దానం మేరకు గీత కార్మిక సొసైటీలకు సైతం రిజర్వేషన్లు కల్పించాలని స్పష్టంచేశారు. సర్కారు దిగిరాకుంటే వచ్చే శనివారం గౌడ సంఘాలతో సమావేశమై కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. కాంగ్రెస్ సర్కారు పనికిరాని పదవులను బీసీలకు కేటాయిస్తున్నదని మండిపడ్డారు. కల్తీ పేరిట కల్లు దుకాణాలను నిషేధించాలని నిర్ణయించిన ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రతిఘటనతోనే వెనక్కి తగ్గిందని అన్నారు. కల్తీ కల్లుతో ఉన్న సమస్యకంటే కాంగ్రెస్‌లో కల్తీ నాయకులతోనే ఉన్నదని ఎద్దేవా చేశారు.
బీసీలకు కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేదాకా వెంటపడుతామని బీసీ కమిషన్ మాజీ సభ్యుడు కిశోర్‌గౌడ్ స్పష్టం చేశారు. 42 శాతం బీసీ రిజర్వేషన్లపై మాట తప్పినట్టే వైన్స్‌లో 25 శాతం గౌడన్నలకు కోటా విషయంలోనూ ద్రోహం చేసిందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ కామారెడ్డి డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీల వైఫల్యంపై ప్రజాక్షేత్రంలో ఎండగడతామని, అవసరమైతే కర్ణాటకకు వెళ్లి సిద్ధరామయ్యను కలిసి వైఫల్యాలను వివరిస్తామని చెప్పారు.
హైదరాబాద్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ): బీసీలకు మేలు చేస్తామని చెప్పి.. కామారెడ్డిలో కాంగ్రెస్ ప్రవేశపెట్టిన బీసీ డిక్లరేషన్‌లోని అంశాలు ఏమయ్యాయని గౌడ ఐక్య సాధన సమితి నిలదీసింది. ఈ మేరకు గౌడ ఐక్యసాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు అంబాల నారా యణగౌడ్ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. గౌడ కల్లుగీత వృత్తిదారుల ఉపాధిని పెంచేవిధంగా నూతన మద్యం పాలసీని పున:సమీక్షించాలని కోరారు. గౌడ్లకు 25శాతం వైన్‌షాపుల్లో రిజర్వేషన్ ఇచ్చి.. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ హామీని కాంగ్రెస్ నిలబెట్టుకో వాలని డిమాండ్‌చేశారు. కల్లుగీత సొసైటీలకే వైన్‌షాపులు ఇవ్వాలని డిమాండ్‌చేశారు. మద్యంపాలసీ వల్ల గీత కార్మికులు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉన్నదని.. అందుకే గౌడన్నలకు 25శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరారు.