Srinivas Goud | హైదరాబాద్ : రాష్ట్ర యువతను మత్తులోకి దించేలా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన మద్యం పాలసీ ఉందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫైర్ అయ్యారు. తెలంగాణ భవన్లో శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడారు.
ఎక్సైజ్ పాలసీ తెలస్తామని అంటే ఏదో గొప్పగా ఉంటుంది అనుకున్నాం. ఏదైనా మద్య నిషేధం ప్రకటిస్తారేమో అనుకున్నాం. కానీ కొత్తగా మైక్రో బ్రూవరీలను తెరుస్తామని పాలసీలో ప్రకటించారు. వెయ్యి గజాల స్థలం ఉంటే చాలు మైక్రో బ్రువరీలను పెట్టుకోవచ్చట. ఊరుకో కంపెనీ పెట్టి అందరితో బీర్లు తాగించేలా ఉంది మద్యం విధానం. యువతను మద్యం మత్తులోకి దించేలా పాలసీ ఉందని శ్రీనివాస్ గౌడ్ ధ్వజమెత్తారు.
నీరా కేఫ్‌లు తెరవాలని మేము అంటే ఊరూరా బీరు షాపులు తెరుస్తున్నారు. బెల్ట్ షాపులు ఎత్తి వేస్తామని చెప్పి వాటి సంఖ్య పెంచుతున్నారు. ఆదాయం పెంచుకునే పేరిట విచ్చలవిడిగా మద్యం షాపులకు అనుమతి ఇవ్వబోతున్నారు. నీరా ఓ హెర్బల్ డ్రింక్. మేము నీరా పాలసీ తెస్తే దాన్ని నిర్వీర్యం చేశారు. యువతను మద్యం మత్తులో దించి హామీలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించే తత్వాన్ని చంపే ప్రణాళిక వేస్తున్నారు. మైక్రో బ్రువరీల ఏర్పాటు ఆలోచనను తక్షణమే విరమించుకోవాలి అని శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు.
మద్యం పాలసీకి యువత ప్రాణాలు బలిపెడతామంటే ఊరుకునేది లేదు. తాగాలి ఊగాలి అనే పద్దతిలో రాష్ట్రప్రభుత్వం వ్యవహరిస్తున్న పద్ధతి మంచిది కాదు. యువత జీవితాలతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటం ఆడొద్దు. రాష్ట్రంలో ఎవ్వరినీ కదిలించినా కేసీఆర్‌ను మళ్ళీ సీఎం చేసుకుంటామంటున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు కూడా వారి సొంత ప్రభుత్వంపై సంతోషంగా లేరు అని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
ఉద్యమంలో కవిత సహా అందరం కలిసే పని చేశాము. కేసీఆర్‌నే సీఎంగా చూడాలని అందరికీ ఉంది. ప్రతీ బీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్‌ను మూడో సారి సీఎంగా చేసుకోవాలని అనుకుంటున్నారు. హరీష్ రావు, సంతోష్ రావు కేసీఆర్‌ను కంటికి రెప్పలా కాపాడుకున్నారు. పార్టీలో నెంబర్ వన్ స్థానం కేసీఆర్‌దే. తెలంగాణ బాగుపడటమే కేసీఆర్ ఆశ. కవిత ఆరోపణలు దురదృష్టకరం అని శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు.