Niranjan Reddy | హైదరాబాద్ : కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ రాజకీయ విలువలకు కట్టుబడి ఉంటే కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ నేతలతో వారి ఎమ్మెల్యేల పదవులకు రాజీనామా చేయించాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సవాల్ విసిరారు. తెలంగాణ భవన్లో నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
రాజ్యాంగ స్ఫూర్తి, ప్రజాస్వామ్య విలువలను కాపాడుతామని రాహుల్ గాంధీ పాదయాత్రలో ప్రకటించారు. రాజ్యాంగాన్ని పట్టుకుని ప్రమాణస్వీకారం చేసిన రాహుల్ గాంధీ మరో చేత్తో బీఆర్ఎస్ నేతల చేతులు పట్టుకుంటున్నారు. అలాంటప్పుడు రాహుల్ గాంధీ రాజ్యాంగ విలువలను కాపాడుతున్నారా..? అంటే లేదనే చెప్పాలి. ఇతర పార్టీల వారు కాంగ్రెస్ పార్టీలో చేరాల్సి వస్తే రాజీనామా చేయాలని రాహుల్ గాంధీ ఎందుకు అనడం లేదు. పార్లమెంట్లో నాగరిక పౌరుడిగా ప్రశ్నిస్తానంటూనే రాష్ట్రాల్లో ఏం చేస్తున్నారు.. పచ్చి అవకాశవాదానికి నిదర్శనంగా ఉంది రాహుల్ గాంధీ తీరు అని నిరంజన్ రెడ్డి మండిపడ్డారు.
మొన్నటి ఎన్నికల్లో మోదీ కష్టంగా గెలిచారు. మీరు దేశానికి ఏదో గొప్ప చేయబోతున్నామని చెప్పుకుంటున్నారు. కానీ పార్టీ ఫిరాయింపులకు పాల్పడితే రాజకీయ పక్షాలు మిమ్మల్ని వదిలిపెట్టరు. కాంగ్రెస్ చేరిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలను ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేదా..? ఆ ధైర్యం లేనప్పుడు భారత పార్లమెంట్‌ను భవిష్యత్‌లో ఎలా నడిపిస్తారు. ఇతరులకు పుట్టిన కొడుకులను నా కొడుకులు అని నామకరణం చేస్తే గొప్పతనం అవుతందా..? అని నిరంజన్ రెడ్డి నిలదీశారు. వివిధ అంశాలతో రాహుల్ గాంధీకి నాలుగు పేజీల లేఖను పంపిస్తున్నాం అని మాజీ మంత్రి తెలిపారు.