కామారెడ్డి, డిసెంబర్ 9: బియ్యం సేకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం రైతుల జీవితాలతో ఆటలాడుతున్నదని కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి షబ్బీర్అలీ మండిపడ్డారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాలులో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రం తెలంగాణ ప్రాంత రైతులపై వివక్ష చూపుతున్నదని ఆరోపించారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వంపై సీఎం కేసీఆర్ జంగ్ సైరన్ మోగించాలని కోరారు. రాష్ట్రసాధన కోసం పార్లమెంట్లో చేసిన పోరాటస్ఫూర్తిని ధాన్యం సేకరణ విషయంలోనూ చూపించాలని విజ్ఞప్తి చేశారు. నోట్ల రద్దుతో జనజీవనం అతలాకుతలమైందని, ఇప్పుడు బియ్యం సేకరణ విషయంలో అలాగే చేస్తున్నదని కేంద్రంపై మండిపడ్డారు.