ఫర్టిలైజర్‌సిటీ, జూన్ 25: కాంగ్రెస్ పార్టీకి చెందిన వారి దాడుల్లో నష్టపోయిన బాధితులపైనే పోలీసులు కేసులు నమోదు చేయడమేమిటని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మంచిర్యాల, బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యేలు దివాకర్‌రావు, దుర్గం చిన్నయ్య ప్రశ్నించారు. బీఆర్ఎస్ నాయకుడు దగ్గుల మధుపై దాడి చేసి, తల పగులగొట్టగా మంచిర్యాల పోలీసులు బాధితుడైన మధుపైనే కేసునమోదు చేయడంపై అభ్యంతరాలు వ్యక్తంచేశారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ఝాకు బుధవారం వారు ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు గంజాయి బ్యాచ్‌ను ప్రోత్సహిస్తూ దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. ఇటీవల మంచిర్యాలకు చెందిన గడప రాకేశ్, కందుల ప్రశాంత్‌పై గత వినాయక చవితి సందర్భంగా దాడులు చేస్తే వారిపైనే అక్రమ కేసులు బనాయించారని తెలిపారు. ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు అనుచరులు దాడులు చేస్తూ భూకబ్జాలు, సెటిల్మెంట్లుకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. దళితులని కూడా చూడకుండా కేసులు నమోదు చేశారని తెలిపారు. గతంలో పదేండ్లు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నా ప్రతిపక్ష నాయకులపై దాడులు చేయలేదని, పైగా ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో ప్రజలకు దగ్గరయ్యామని గుర్తుచేశారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా వారియర్లపై జరిగిన దాడులపై సమగ్ర విచారణ జరుపాలని సీపీకి ఫిర్యాదు చేసినట్టు తెలపారు.