Harish Rao | హైదరాబాద్ : గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు తెలంగాణకు మరణ శాసనం కాబోతుంది అని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. గోదావరి పేరుతో నాగార్జున సాగర్ కుడి కాలువను డబుల్ చేసి రోజుకి రెండు టీఎంసీల కృష్ణా జలాలను తరలించే కుట్ర జరుగుతుంది. మిస్టర్ రేవంత్ రెడ్డి.. ఇప్పటికైనా నిజాయితీగా పోరాడు.. తెలంగాణకు అన్యాయం చేయకు అని హరీశ్‌రావు హెచ్చరించారు. తెలంగాణ భవన్లో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు.
కేసీఆర్ మొత్తం నీళ్ళు వదిలేసిండు అంటడు రేవంత్ రెడ్డి.. 2.10.2020 నాడు కేసీఆర్.. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌కు లేఖ రాశారు. అందులో ఏముంది 3000 టీఎంసీల మిగులు జలాలు సగటున ఉంటున్నాయి. ప్రస్తుతం ఉన్న 968 కాక, ఈ మూడు వేలలో వాటా కావాలని, మొత్తం 2918 టిఎంసీలు తెలంగాణ హక్కు అని స్పష్టంగా కేసీఆర్ రాశారు. గోదావరిలో వెయ్యి, కృష్ణాలో 500 టీఎంసీలు ఇచ్చి ఏమైనా చేసుకో అన్నడు మొన్న. నువ్వెవడివి తెలంగాణ హక్కులు వదిలి పెట్టడానికి అంటే నిన్న రేవంత్ రెడ్డి మాట మార్చిండు. వరద జలాల్లోనూ వాటా కావాలని నిన్న అంటున్నడు. 3000 టీఎంసీలు అనేది ఓసారి బ్రహ్మ పదార్థం అంటడు, రాచపుండు అంటడు రేవంత్ రెడ్డి అని హరీశ్‌రావు మండిపడ్డారు.
సముద్రంలో కలిసే జలాలు 58 ఏండ్ల సగటు 3వేల టీఎంసీల దాకా ఉంది. ఇది తెల్వక రేవంత్ రెడ్డి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నడు. నదీ మార్గంలో నీళ్లు తేవాలని ఆనాడు కేసీఆర్, జగన్‌తో అన్నారు. అది కాదని భూభాగంలో నీళ్లు తరలించే ప్రయత్నం మొదలు పెట్టారు. కేసీఆర్ ఆదేశాల మేరకు 2022లో నేను ఢిల్లీ వెళ్లి షెకావత్‌కి లేఖ అందించాను. గోదావరి పెన్నా లింక్ అడ్డుకోవాలని కోరాను. గోదావరి బనకచర్ల ప్రాజెక్టులో కృష్ణా నీళ్ల మళ్లింపు కూడా ఉంది. డీపీఆర్‌లో క్లియర్‌గా పేర్కొన్నారు. రెండు నదుల నీళ్లు కొల్లగొడుతామని చెప్పారు. నాగార్జునసాగర్ కుడి కాల్వను డబుల్ చేసి, రోజుకు 2 టిఎంసీల చొప్పున వరద జలాల పేరిట బొల్లపల్లి రిజర్వాయర్‌కు తరలిస్తామంటున్నరు. ఒకవైపు గోదావరి, మరోవైపు కృష్ణా నీళ్ల తరలింపు కోసమే గోదావరి బనకచర్ల ప్రాజెక్టు. ఏ విధంగా చూసినా గోదావరి బనకచర్ల తెలంగాణకు మరణ శాసనం కాబోతున్నది. నువ్వు అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ తెలంగాణ ద్రోహివే. నీళ్లు ఏపీకి దారాదత్తం చేసి తెలంగాణ ద్రోహిగా మిగిలిపోకు రేవంత్ రెడ్డి అని హరీశ్‌రావు నిప్పులు చెరిగారు.