Harish Rao | హైదరాబాద్ : దొంగే దొంగ అన్నట్టుంది రేవంత్ రెడ్డి తీరు.. కిషన్ రెడ్డిది, రేవంత్ రెడ్డిది ఫెవికాల్ బంధం అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు.
ఓటుకు నోటు కేసులో ఈడీ కేసు ఉంటే ఎందుకు విచారణ జరగడం లేదు. బీహార్ ఎన్నికలకు డబ్బులు పంపుతున్నారని ఢిల్లీలో భట్టి విక్రమార్క ఇంట్లో ఐటీ రైడ్లు జరిగాయి. గుర్గావ్లో భట్టి విక్రమార్క ఇల్లు, ఆయన అత్తగారిల్లు ఉంది. ఈ విషయం ఎందుకు బయటకు రాలేదు. బీజేపీకి కాంగ్రెస్ పార్టీకి మధ్యలో ఉన్న ఒప్పందం ఏమిటి? పొంగులేటి ఇంట్లో ఈడీ రైడ్స్ ఐతే ఎందుకు చెప్పలేదు. ఈడీ ఎందుకు పొంగులేటిపై ప్రెస్ స్టేట్మెంట్ ఇవ్వలేదు. బీజేపీతో అంటకాగింది రేవంత్ రెడ్డి. బీజేపీతో చీకటి ఒప్పందాలు ఉన్నాయి రేవంత్ రెడ్డికి. ఢిల్లీలో బీజేపీతో రేవంత్ రెడ్డి చీకటి రాజకీయాలు బయటపడ్డాయి అని హరీశ్‌రావు పేర్కొన్నారు. 2023లో రెండు కోట్ల 73 లక్షల టన్నుల వరి ధాన్యము ఉత్పత్తి జరిగింది. మంత్రమేస్తే ఇంత దిగుబడి రాలేదు. పెద్ద ఎత్తున ప్రాజెక్టులు నిర్మించి, 24 గంటల కరంట్ తెచ్చి, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి, మిషన్ కాకతీయ ద్వారా చెరువుల్లో పూడిక తీసి పంటను పెంచాము. కాళేశ్వరం కూలిందని అంటారు. హైదరాబాద్‌కు 20 టీఎంసీల గోదావరి జలాల తరలింపుకు ప్రణాళిక చేసామని ముఖ్యమంత్రి అంటాడు. మల్లన్న సాగర్ కాళేశ్వరంలో అంతర్భాగం కాదా? 7,000 కోట్లతో మల్లన్న సాగర్ నుంచి హైదరాబాదుకు గోదావరి జలాలను ఎలా తెస్తావు? అని హరీశ్‌రావు ప్రశ్నించారు.
కాళేశ్వరం అంటే మేడిగడ్డ బ్యారేజ్, కన్నెపల్లి పంప్ హౌస్, అన్నారం బ్యారేజీ, సరస్వతి పంప్ హౌస్, సుందిళ్ల బ్యారేజీ, పార్వతి పంప్ హౌస్, నంది మేడారం రిజర్వాయర్, నంది మేడారం పంప్ హౌస్, గాయత్రి పంప్ హౌస్, రాంపూర్ పంప్ హౌస్, రాజేశ్వరంపేట పంప్ హౌస్, మల్కంపేట రిజర్వాయర్, మల్కంపేట పంప్ హౌస్, ముప్పల్ పంప్ హౌస్, అప్పర్ మానేరు పంప్ హౌస్, అనంతగిరి రిజర్వాయర్, అనంతగిరి పంప్ హౌస్, రంగనాయక సాగర్ రిజర్వాయర్, రంగనాయక సాగర్ పంప్ హౌస్, మల్లన్న సాగర్ రిజర్వాయర్, మల్లన్న సాగర్ పంప్ హౌస్, కొండపోచమ్మ రిజర్వాయర్, కొండపోచమ్మ సాగర్ పంప్ హౌస్, వన్ పంప్ హౌస్ టు బస్వాపూర్ రిజర్వాయర్. ఇవన్నీ కూలినయా? ఇవన్నీ కనిపించడం లేదా రేవంత్ రెడ్డి? రిజర్వాయర్ల కింద పంట పండడం లేదా? పంట పండేది నిజం. రైతుల కళ్ళల్లో ఆనందం నిజం అని హరీశ్‌రావు పేర్కొన్నారు.