Harish Rao | సీఎం రేవంత్‌రెడ్డి అడిగినవాళ్లను అదరగొడుతున్నాడని.. ప్రశ్నిస్తే పగబడుతున్నాడని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. బీఆర్ఎస్ మెదక్ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక క్రిస్మస్ కానుకలు ఇవ్వలేదని ఆరోపించారు. కేసీఆర్ అధికారంలో ఉండగా క్రిస్మస్ అధికారికంగా నిర్వహించామని గుర్తు చేశారు. అన్ని మతాలకు రేవంత్ రెడ్డి అన్యాయం చేశాడన్నారు. రేవంత్ ఏడాది పాలనలో ఓర్లుడే కానీ.. ఓదార్పు లేదన్నారు. అడిగినవాళ్లను అదరగొడుతుండని.. ప్రశ్నిస్తే పగబడుతుండని మండిపడ్డారు. అసెంబ్లీ లో రేవంత్ అన్ని అబద్ధాలు మాట్లాడుతూ.. అసెంబ్లీని అపవిత్రం చేశాడంటూ మండిపడ్డారు.
రాష్ట్రంలో క్రైమ్‌రేట్ 41శాతం పెరిగిందని హరీశ్‌రావు తెలిపారు. కేసీఆర్ ఏడాది పాలనలో 25వేల కేసులయితే.. రేవంత్ పాలనలో 35వేల కేసులు పెరిగాయన్నారు. పరిపాలనలో సీఎంగా.. హోంమంత్రిగా ఫెయిల్ అయ్యాడని విమర్శించారు. ఏడాదిలో తొమ్మిది మత కల్లోలాలు జరిగాయని.. అసెంబ్లీలో ఆరు గ్యారెంటీల గురించి సీఎం చేతులెత్తెశారన్నారు. నమ్మి ఓట్లేస్తే ప్రజలకు గాడిద గుడ్డు మిగిల్చాడని.. ఏడాది లో రూ 1.25 లక్షల కోట్లు అప్పుచేసి కాంట్రాక్టర్ల కు బిల్లులిచ్చి కమిషన్లు తీసుకున్నాడని మండిపడ్డారు. కొత్త పథకాలు ఏమి ఇయ్యలేదని.. ఉన్న పథకాలు బంద్ పెట్టిండని ఆరోపించారు. రైతు భరోసా ఎప్పుడూ ఇస్తావని.. అడిగితె రెండు గంటల ఉపన్యాసమంతా చెత్త అని విమర్శించారు. ఏడాది పాలనలో రైతుబంధు ఇయ్యలే.. యాసంగి రైతుబంధు ఎప్పుడు ఇస్తావో చెప్పు అని అడిగామన్నారు. రైతులందరికీ ఎకరాకు రూ.15వేల రైతుబంధు ఇవ్వాలన్నారు. రైతులు వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు తెచ్చుకుంటున్నారన్నారు. కౌలు రైలును సీఎం మోసం చేశాడని మండిపడ్డారు. సీఎం, మంత్రులకు కో ఆర్డినేషన్ లేదన్నారు.
ఎకరం లోపు భూమి ఉన్న కూలీలుగా గుర్తించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుందన్నారు. ప్రతి కూలీకి ఎలాంటి కోతలు లేకుండా రైతు బంధు ఇవ్వాలని.. తిండి పెట్టె రైతులకు తొండి చేసి రైతుబంధును ఎగ్గొట్టేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ మంత్రులను, ఎమ్మెల్యేలను, లీడర్లను నిలదీయాలని హరీశ్‌రావు పిలుపునిచ్చారు. కరోనా వచ్చినా కేసీఆర్ రైతుబంధు ఆపలేదన్నారు. రూ.75వేల కోట్ల రైతుబంధు కేసీఆర్ ఇచ్చారన్నారు. సీఎం మెదక్ పర్యటనను స్వాగతిస్తున్నామన్నారు. ఏడుపాయల అమ్మవారి అమ్మవారి దగ్గర ముక్కు నెలకు రాసి ప్రయాచిత్తం చేసుకోవాలని సూచించారు. రుణమాఫీ చేస్తానని మాట తప్పిన రేవంత్ క్షమించమని అడుగాలని.. ముక్కోటి దేవుళ్ల మీద ఒట్టేసి రేవంత్ మాట తప్పిండని విమర్శించారు. మెదక్ జిల్లాలో ఏ ఊరుకైనా వెళ్లి రుణ మాఫీ అయిందా? అని వెళ్లి అడుగుదామని.. రుణమాఫీ అయితే నేను ముక్కు నేలకు రాస్తానన్నారు. ఇవ్వకుంటే నువ్వు రాస్తావా? అంటూ సీఎం రేవంత్‌కు సవాల్ విసిరారు.
ఏం ముఖం పెట్టుకొని సిగ్గులేకుండా మెదకు వస్తున్నారని సీఎం రేవంత్‌ను హరీశ్‌రావు నిలదీశారు. 2లక్షలపైన ఎక్కువ రుణం ఉన్నవారు డబ్బులు కడితే ఇస్తానని చెప్పి మోసం చేశాడని.. మెదక్ జిల్లాలో ఒక్కరోజే ముగ్గురు రైతులు, ఏడాది పాలనలో నాలుగైదు వందల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. ధాన్యం కొనడంలో ప్రభుత్వం ఫెయిల్ అయ్యిందన్నారు. ధాన్యాన్ని రైతులు దళారులకు అమ్ముకున్నారని.. వడ్లు కొనడంలో చేతగాని ప్రభుత్వమని కాంగ్రెస్ ప్రభుత్వమన్నారు. ధాన్యం అమ్మిన రైతులకు ఇంకా డబ్బులు పడలేదన్నారు. మీడియా సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్ రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జి తిరుపతి రెడ్డి, మాజీ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, మాజీ ఏఎంసీ చైర్మన్ బట్టి జగపతి, మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.