Harish Rao | సంగారెడ్డి, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ఉద్యమం గురించి రేవంత్‌రెడ్డి మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉన్నదని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమ చరిత్ర రాస్తే రేవంత్‌రెడ్డి ద్రోహ చర్రిత ఉంటుందని, ఉద్యమానికి రేవంత్ ఎలా ద్రోహం చేశాడో చర్రితలో నిక్షిప్తమవుతుందని ధ్వజమెత్తారు. ‘ఎప్పటికైనా నీ ద్రోహ చరిత్ర మలిగిపోదు..తెలంగాణ సాధకుడిగా కేసీఆర్ కీర్తి తొలగిపోదు.. ఈ విషయాన్ని రేవంత్‌రెడ్డి గుర్తించుకోవాలె’ అని హెచ్చరించారు. బుధవారం సంగారెడ్డిలో హరీశ్ పర్యటించారు. అనారోగ్యంతో బాధపడుతున్న మాజీ ఎమ్మెల్సీ ఆర్.సత్యనారాయణను పరామర్శించారు. అనంతరం సంగారెడ్డి కలెక్టరేట్లో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలవేశారు. అమరుల స్తూపం వద్ద ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, బీఆర్ఎస్ నాయకులతో కలిసి నివాళులర్పించారు. తర్వాత ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి ఏఒక్కరోజు కూడా జై తెలంగాణ అనలేదని, అమరులకు నివాళులర్పించలేదని, ఉద్యమంలో పదవులకు రాజీనామా చేయాలని జేఏసీ చైర్మన్ కోదండరామ్ కోరితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా రేవంత్‌రెడ్డి వెన్నుచూపి పారిపోయాడని గుర్తుచేశారు. కేసీఆర్ ఆమరణదీక్ష ఫలితంగానే తెలంగాణ ఏర్పడిందని, ఎవరి దయాదాక్షిణ్యాలతోనో రాలేదని స్పష్టంచేశారు. కేసీఆర్ దీక్ష చేపట్టిన నవంబర్ 29 లేకుంటే డిసెంబర్ 9 ప్రకటన లేదని, డిసెంబర్ 9న ప్రకటన లేకుంటే జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లేదని తేల్చిచెప్పారు. కొందరు తెలంగాణ చరిత్రను మార్చే వెకిలి మకిలి ప్రయత్నాలు చేస్తున్నారని, అవి కల్లలుగా మిగిలిపోతాయని హెచ్చరించారు.
ఉద్యమకారులపై తుపాకీ ఎక్కుపెట్టినవ్
ఉద్యమకారులపైకి తుపాకీ ఎక్కుపెట్టిన ద్రోహ చరిత్ర రేవంత్‌రెడ్డిదని హరీశ్ మండిపడ్డారు. నాడు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్‌రెడ్డి జై తెలంగాణ అనలేదని, రెండు కండ్ల సిద్ధాంతి చంద్రబాబును ప్రజలు నిలదీస్తుంటే ఆయన కోసం రైఫిల్ పట్టుకొని బయలుదేరిన వ్యక్తి రేవంత్‌రెడ్డి అని ఆగ్రహం వ్యక్తంచేశారు. వంటావార్పు, రహదారుల దిగ్బంధం, రైలురోకో, మిలియన్ మార్చ్, సకల జనుల సమ్మె, సాగరహారం ఇలా ఏ కార్యక్రమంలోనూ రేవంత్‌రెడ్డి పాల్గొనలేదని స్పష్టంచేశారు. నాడు సోనియాను బలిదేవత అన్న రేవంత్‌రెడ్డి, ఇప్పుడు సోనియాను దేవత అనడం విడ్డూరంగా ఉన్నదని దెప్పిపొడిచారు. ‘అధికారం ఉన్నది కదా అని మిడిసిపడుతూ నువ్వు చెప్పిందే చరిత్ర అనుకుంటున్నవ్.. నీ ద్రోహ చరిత్ర చెరిగిపోయేది కాదు’ అని హెచ్చరించారు. ‘తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి మేమే రాష్ర్టాన్ని తెచ్చినం అని రేవంత్‌రెడ్డి మాట్లాడితే విశ్వసించేంత అమాయకులు కాదు ప్రజలు!’ అని తేల్చిచెప్పారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని అధికారికంగా ఎక్కడా పెట్టలేదని రేవంత్‌రెడ్డి చెప్పటంపై మండిపడ్డారు. 2015, జూన్ 2న సంగారెడ్డి కలెక్టరేట్లో అధికారికంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని మంత్రి హోదాలో తానే ఆవిష్కరించానని గుర్తుచేశారు.
కార్యక్రమంలో తనతోపాటు అప్పటి ఎమ్మెల్యేలు బాబూమోహన్, చింతాప్రభాకర్, మదన్‌రెడ్డి, కలెక్టర్ రాహుల్ బొజ్జా పాల్గొన్నారని తెలిపారు. నాడు విగ్రహాన్ని ఆవిష్కరించినందుకు గుర్తుగానే ఈ రోజు కలెక్టరేట్లో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించినట్టు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అధికారికంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని కలెక్టరేట్లలో, గ్రామాల్లో, విదేశాల్లో కూడా పెట్టామని, అలాంటి విగ్రహాలను తొలగిస్తావా? అని రేవంత్‌రెడ్డిపై ధ్వజమెత్తారు. కేసీఆర్ సైతం 2023, జూన్ 22న అమరుల స్మారక చిహ్నాన్ని ప్రారంభించిన రోజు తెలంగాణ తల్లి కాంస్య విగ్రహాన్ని కూడా స్మారక చిహ్నంలో పెట్టారని గుర్తుచేశారు. తెలుగుతల్లి, కర్ణాటకతల్లి, తమిళతల్లి, భారతమాతను ఏ ప్రభుత్వాలూ మార్చలేదని, రేవంత్‌రెడ్డి మాత్రం తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చటం సిగ్గుచేటని మండిపడ్డారు. మాయమాటలతో ప్రజలను మధ్యపెట్టి అధికారంలోకి వచ్చిన రేవంత్‌రెడ్డి, రైతుబంధు, దళితబంధు, బీసీబంధు, కేసీఆర్ కిట్లు, బతుకమ్మ చీరలను బంద్ పెట్టి అన్ని వర్గాల వారిని మోసం చేశారని ధ్వజమెత్తారు. గురుకులాల్లో 49 విద్యార్థులు మరణించారని, వందలాది మంది అనారోగ్యం పాలయ్యారని ఆవేదన వ్యక్తంచేశారు. ‘తెలంగాణ తల్లి విగ్రహాన్నో, టీఎస్‌ను టీజీ అనో మార్చటం కాదు.. దమ్ముంటే తెలంగాణ ప్రజల బతుకులు మార్చు’ అని సవాల్ చేశారు.
తెలంగాణకు మొట్టమొదటి ద్రోహి కాంగ్రెస్సే
తెలంగాణకు నంబర్ వన్ ద్రోహి కాంగ్రెస్ పార్టీ అని హరీశ్ ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను అడుగడుగునా కాలరాసిన చరిత్ర కాంగ్రెస్ సొంతమని నిప్పులు చెరిగారు. ఉద్యమాన్ని అణచివేసి, ఎంతోమంది ఉద్యమకారుల ప్రాణాలను బలిగొన్నదని, ఆంధ్రా నాయకుల లాబీయింగ్‌కు తలొగ్గి ఉన్న తెలంగాణను కూడా ఆంధ్రాలో కలిపిందని ఫైర్ అయ్యారు. ‘ఫజల్ అలీ కమిషన్ సిఫార్సులను తుంగలో తొక్కింది నెహ్రూ రాజ్యమైతే.. 1969 ఉద్యమాన్ని ఇనుపకాళ్లతో తొక్కింది ఇందిరమ్మ రాజ్యం’ అని మండిపడ్డారు. అసెంబ్లీ ముందు ఉన్న అమరవీరుల స్థూపం కాంగ్రెస్ జరిపిన దమన కాండకు నిదర్శనమని తెలిపారు. 1969లో ఉద్యమంలో 369 మందిని కాంగ్రెస్ కాల్చిచంపితే అందుకు సూచికగానే అసెంబ్లీ ముందు అమరవీరుల స్తూపాన్ని ఏర్పాటు చేసినట్టు చెప్పారు. జై తెలంగాణ అన్న పాపానికి 369 మందిని కాల్చి చంపింది కాంగ్రెస్ కాదా? అని ప్రశ్నించారు. ‘చెన్నారెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రజా సమితిని ప్రజలు గెలిపించి తమ ఆకాంక్షను కేంద్ర ప్రభుత్వానికి చాటిచెప్తే, ఆ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసుకొని తెలంగాణ ప్రజల ఆకాంక్షలను కాలరాసింది కాంగ్రెస్ పార్టీ.. ఏ నాయకునికి పదవి రాకపోయినా తెలంగాణ పేరిట దుకాణం పెట్టడం ..పదవిరాగానే దుకాణం బంద్ పెట్టడం.. ఇదీ కాంగ్రెస్ చరిత్ర’ అని ఎద్దేవా చేశారు.
కేసీఆర్ లేకుంటే తెలంగాణ మాటే లేదు
2001లో కేసీఆర్ పార్టీ పెట్టకపోతే, కేసీఆర్ పోరాడకపోతే తెలంగాణ అనే మాట కూడా లేదని హరీశ్ స్పష్టంచేశారు. ‘ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఎవరైనా ఎమ్మెల్యే లేచి.. నా తెలంగాణ అంటే, తెలంగాణ అనే పదాన్ని నిషేధించినం.. తెలంగాణ అనవద్దు.. వెనకబడిన ప్రాంతం అనాలని నాటి ఆంధ్రపాలకులు చెప్పేవాళ్లు’ అని గుర్తుచేశారు. 50 ఏండ్లు రాష్ర్టాన్ని పాలించిన కాంగ్రెస్, 16 ఏండ్లు పాలించిన టీడీపీ తెలంగాణకు తీరని అన్యాయం చేశాయని చెప్పారు. అసెంబ్లీలో తెలంగాణ పదాన్ని నిషేధించిన రోజుల్లోనే కేసీఆర్ పార్టీని పెట్టారని గుర్తుచేశారు. 2004లో టీఆర్ఎస్తో కాంగ్రెస్ పొత్తుపెట్టుకొని తెలంగాణ ఇస్తామని నమ్మబలికిందని చెప్పారు. ‘కేంద్ర ప్రభుత్వంలో చేరను అని కేసీఆర్ చెప్తే.. కామన్ మినిమమ్ ప్రోగ్రాంలో తెలంగాణ ఏర్పాటు అంశాన్ని పెడుతం.. రాష్ట్రపతి ప్రసంగంలో చెప్పిస్తం.. తెలంగాణ ఇస్తం అని హామీ ఇచ్చాకనే కేంద్ర క్యాబినెట్లో కేసీఆర్ చేరిండ్రు’ అని గుర్తుచేశారు.
ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలిసిందేనని, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిని కాంగ్రెస్‌లో చేర్చుకునే ప్రయత్నంతోపాటు ఉద్యమాన్ని కాలరాసే ప్రయతాన్ని కాంగ్రెస్ చేసిందని వివరించారు. ప్రణబ్‌ముఖర్జీ కమిటీ గాని, కాంగ్రెస్ పార్టీ గాని తెలంగాణ ఏర్పాటు కోసం కృషి చేయలేదని, కేసీఆర్ ఒక్కడే ఆర్ఎస్ఎస్ ఆఫీసు నుంచి ఆర్ఎస్యూ ఆఫీసు దాకా గల్లీగల్లీ తిరిగి రాష్ట్రం కోసం 32 రాజకీయ పార్టీలను ఒప్పించారని, ఆ పార్టీలతో ప్రణబ్ కమిటీకి లేఖలు ఇప్పించారని గుర్తుచేశారు. కేసీఆర్ తెలంగాణ కోసం కేంద్రాన్ని ఒప్పించే ప్రయత్నం చేస్తే రాష్ట్రంలో ఉన్న నాటి సీఎం రాజశేఖర్‌రెడ్డి తెలంగాణను అడ్డుకునే కుట్ర చేశారని, హైదరాబాద్ పోవాలంటే వీసా కావాలని ప్రజలను రెచ్చగొట్టారని తెలిపారు. 32 రాజకీయ పార్టీలను ఒప్పించినా కేంద్రం తెలంగాణ ఇవ్వకపోతే కేసీఆర్ మంత్రి పదవికి, ఎంపీ పదవికి రాజీనామా చేసి మరోమారు ఉద్యమానికి శ్రీకారం చుట్టినట్టు తెలిపారు. అయినా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఇవ్వలేదని, చివరికి కేసీఆర్ మంత్రి, ఎంపీ పదవులకు రాజీనామా చేసి మళ్లీ ఉద్యమానికి శ్రీకారం చుట్టారని చెప్పారు.
డిసెంబర్ 9 ప్రకటనను రాసిచ్చిందే కేసీఆర్
‘కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో’ అని కేసీఆర్ ఆమరణదీక్ష చేపట్టారని, అరెస్టు చేసినా దీక్ష కొనసాగించారని, ప్రాణాలను కూడా లెక్కచేయకుండా 11 రోజుల పాటు ఆమరణ దీక్ష చేయడం వల్లే కేంద్రంలోని నాటి కాంగ్రెస్ సర్కార్ దిగివచ్చి డిసెంబర్ 9న తెలంగాణ ఏర్పాటుపై ప్రకటన చేసిందని హరీశ్ వివరించారు. డిసెంబర్ 9న కేసీఆర్ వెన్నంటే తాను, ప్రొఫెసర్ జయశంకర్ ఉన్నట్టు చెప్పారు. తాను ఉండగానే కేసీఆర్‌కు చిదంబరం ఫోన్ చేశారని తెలిపారు. ఉత్తుత్తి ప్రకటన చేస్తే ఒప్పుకోమని, తెలంగాణపై స్పష్టమైన ప్రకటన చేస్తేనే అమరణదీక్ష విరమిస్తానని కేసీఆర్ స్పష్టం చేశారని, కేసీఆర్ సూచన మేరకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి ఇంగ్లిష్‌లో ప్రకటన సిద్దం చేశారని, అదే ప్రకటనను చిదంబరం ఢిల్లీలో చదివి వినిపించారని గుర్తుచేశారు.
కేసీఆర్ దీక్ష, తెలంగాణ ప్రజల పోరాట ఫలితంగా తెలంగాణ అవతరణ సాధ్యమైందని, ఈ చరిత్రను ఎవ్వరూ మార్చలేరని స్పష్టం చేశారు. ఇప్పుడు తెలంగాణ ఉద్యమంపై రేవంత్‌రెడ్డి మాటలు వింటే విడ్డూరంగా ఉన్నదని మండిపడ్డారు. ‘నెహ్రూ, గాంధీ పోరాటంతో భారతదేశానికి స్వాతంత్య్రం రాలేదు.. బ్రిటిష్‌వాళ్లు దయతలచి పోతూపోతూ బ్రిటిష్ పార్లమెంట్లో బిల్లు పెట్టి స్వాతంత్రం ఇచ్చారనటం నిజమా? బ్రిటిషర్లు దయతలచి స్వాతంత్య్రం ఇచ్చారా?.. దేశ ప్రజల పోరాటాల ఫలితంగా స్వాతంత్య్రం వచ్చిందా?’ అని ప్రశ్నించారు. ఇక్కడ కూడా అంతే అని, కేసీఆర్ పోరాటాల ఫలితంగానే తెలంగాణ వచ్చిందని, సోనియా దయవల్ల కాదని స్పష్టంచేశారు. విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, బీఆర్ఎస్ నాయకులు పట్నం మాణిక్యం, మామిళ్ల రాజేందర్, ఆర్ వెంకటేశ్వర్లు, మందుల వరలక్ష్మి, కొండల్‌రెడ్డి, డాక్టర్ శ్రీహరి, సాబేర్ పాల్గొన్నారు.
తెలంగాణ గురించి రేవంత్‌రెడ్డి ఎంత తక్కువ మాట్లాడితే అంతమంచిది.. ఎక్కువ మాట్లాడితే నీ ద్రోహచరిత్ర బయటపడుతది. ఉద్యమంలో పాల్గొన్న మామీద 350 కేసులు ఉన్నయి. నీ మీద ఓటుకు నోటు కేసు తప్ప ఒక్క ఉద్యమ కేసైనా ఉన్నదా? తెలంగాణ ఉద్యమానికి అడుగడుగునా వెన్నుపోటు పొడిచిన నువ్వు ఇప్పుడు ఉద్యమం గురించి మాట్లాడటం కంటే దౌర్భాగ్యం ఇంకేదైనా ఉన్నదా?
-హరీశ్‌రావు
సోనియాగాంధీ దయతలిచి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందని చెప్పి తెలంగాణ ఉద్యమకారులను, అమరులను, త్యాగాలను అవమానించినవ్.. ఎవరి దయాదాక్షిణ్యాల మీదనో తెలంగాణ రాలేదు రేవంత్‌రెడ్డీ! ఇది కేసీఆర్ దీక్ష ఫలితం.. తెలంగాణ ప్రజల పోరాట ఫలం.. కేసీఆర్ లేకుంటే తెలంగాణ అవతరణ సాధ్యమయ్యేదే కాదు! ఇది చరిత్ర.. దీన్ని ఎవరూ మార్చలేరు.
-హరీశ్‌రావు