Anil Kurmachalam | బీఆర్ఎస్పైనా, ముఖ్యంగా మాజీ మంత్రి హరీశ్‌రావుపైన సినీ నిర్మాత, కాంగ్రెస్ పార్టీ నాయకుడు బండ్ల గణేశ్ చేసిన విమర్శలను ఎఫ్డీసీ మాజీ చైర్మన్ అనిల్ కూర్మాచాలం తీవ్రంగా ఖండించారు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలతో సంబంధంలేని బండ్ల గణేష్ తన స్థాయిని మరిచారన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎన్నో త్యాగాలు చేసిన బీఆర్ఎస్ పార్టీ పైనా, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావుపైన ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం సరి కాదన్నారు.
బండ్ల గణేశ్ నోరు అదుపులోపెట్టుకోవాలని అనిల్ కూర్మాచలం అన్నారు. పెద్ద నాయకులను విమర్శిస్తే పెద్దవాన్ని అవుతాననే భ్రమలో, రానున్న రోజుల్లో పదవులకు ఆశపడి కాంగ్రెస్ అధినాయకత్వం మెప్పు కోసం పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారన్నారు. ఇలాంటి తెలంగాణకు సంబంధం లేని వ్యక్తులు తెలంగాణ పార్టీని, నాయకులని విమర్శిస్తే రానున్న రోజుల్లో రాష్ట్ర తగిన బుద్ది చెబుతారని స్పష్టం చేశారు. అవసరమైతే బండ్ల గణేశ్‌ను రోడ్డుపై తిరగకుండా చేస్తారన్నారు. కనుక బండ్ల గణేష్ తన స్థాయి తెలుసుకుని ప్రవర్తించాలని హెచ్చరించారు.
తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇలాంటి వాటిని, వీరు చేస్తున్న విమర్శలను సహించరని అనిల్ కూర్మాచలం పేర్కొన్నారు. రానున్న రోజుల్లో వీరిని ప్రోత్సహిస్తున్న వారికి, వారి పార్టీకి తగిన బుద్ది చెబుతారని స్పష్టం చేశారు.