దుబ్బాక, జనవరి 17: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గురువు గన్నే బాల్‌రెడ్డి (92) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం సాయంత్రం సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలోని ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. దుబ్బాక ప్రభుత్వ పాఠశాలలో 1964-69 కాలంలో కేసీఆర్ విద్యనభ్యసించారు. ఇక్కడ నాలుగు నుంచి 9వ తరగతి వరకు చదువుకున్నారు. 4, 5వ తరగతుల్లో బాల్‌రెడ్డి ఆంగ్లం బోధించారు.
దుబ్బాక పర్యటన, ఇతర సమయాల్లో కేసీఆర్ తమ గురువులను తరచూ గుర్తుచేసుకునేవారు. ఇందులో గన్నే బాల్‌రెడ్డిని ప్రత్యేకంగా గౌరవించేవారు. ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించడంతోపాటు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కావడం పట్ల బాల్‌రెడ్డి ప్రతి సమావేశంలో తమ శిష్యుడని గర్వంగా చెప్పుకొనేవారు. బాల్‌రెడ్డి మరణవార్త తెలుసుకున్న ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి వారి నివాసానికి వెళ్లి భౌతికకాయానికి నివాళులర్పించారు. ఆదివారం దుబ్బాకలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.
