ఆర్మూర్, డిసెంబర్ 11: ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డికి స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ సోమవారం నోటీసులు జారీ చేసింది. ఆర్మూర్ ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల సంస్థకు చెందిన స్థలాన్ని విశ్వజిత్ ఇన్ఫ్రా పేరుతో గతంలో జీవన్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తన భార్య పేరిట సబ్ లీజుకు తీసుకున్నారు. అక్కడ వ్యాపార సముదాయ నిర్మా ణం కోసం స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి రూ.20 కోట్ల రుణం తీసుకున్నారు. ఈ మొత్తంతో భారీ షాపింగ్ కాంప్లెక్స్‌ను నిర్మించారు. ఈ భవంతిపై ప్రస్తుతం రూ.45 కోట్ల బకాయిలు ఉన్నట్టు స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ జారీ చేసిన నోటీసుల ద్వారా తెలుస్తున్నది. రూ.20 కోట్ల రుణం, మరో రూ.25 కోట్ల వడ్డీ కలుపుకొని మొత్తం రూ.45 కోట్ల బకాయిలు చెల్లించాలని జీవన్‌రెడ్డి ఇంటికి స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ అధికారులు నోటీసులు అతికించారు. బకాయిపడిన రూ.45 కోట్లు చెల్లించాల్సిందిగా పేర్కొన్నారు.