హైదరాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ): మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) నిబంధనలకు అనుగుణంగా 2024-25 విద్యా సంవత్సరంలో ఎంబీబీఎస్, బీడీఎస్, మెడికల్ పీజీ అడ్మిషన్లలో ఆర్థికంగా వెసుకబడిన తరగతులకు (ఈడబ్యూఎస్) రిజర్వేషన్లు కల్పిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల హైకోర్టుకు తెలియజేసింది. దీంతో ఆ హామీని రికార్డుల్లో నమోదు చేసిన హైకోర్టు.. మెడికల్ కోర్సుల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలు కోసం కామారెడ్డి ఎమ్మెల్యే కటిపల్లి వెంకటరమణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై విచారణ ముగిసినట్టు ప్రకటించింది.
బాలికపై పీఈటీ లైంగికదాడికి యత్నం ; తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల ఆందోళన
కామారెడ్డి, సెప్టెంబర్ 24: ఆరేండ్ల బాలికపై పీఈటీ అత్యాచారయత్నం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జీవదాన్ పాఠశాల పీఈటీ నాగరాజు.. అదే స్కూల్ లో చదివే బాలికపై అత్యాచార యత్నానికి ఒడిగట్టాడు. భయపడిపోయిన బాలిక బడికి వెళ్లనని మారాం చేసింది. ఏమైందని తల్లిదండ్రులు అడిగితే విషయం చె ప్పడంతో సోమవారం పోలీసుల కు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాల నాయకులు, మున్సిపల్ చైర్పర్సన్ ఇందుప్రియ, బాలిక తల్లిదండ్రులు, బంధువులు స్కూల్ కు వచ్చి ఆందోళన చేశారు. అక్కడున్న అద్దాలు, వస్తువులను ధ్వంసం చేశారు. డీఎస్పీ నాగేశ్వర్రావు, సీఐ చంద్రశేఖర్రెడ్డి ఎంత చెప్పినా పట్టించుకోలేదు. ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు విసిరారు. సీఐ చంద్రశేఖర్రెడ్డి, ఎస్సై రాజారాం, మరికొందరికి గాయాలయ్యాయి. దీంతో పోలీసులు లాఠీచార్జి చేశారు. పరిస్థితి చేయి దాటుతుండటంతో అడిషనల్ ఎస్పీ నర్సింహారెడ్డి అక్కడకు చేరుకుని నిరసనకారులతో మాట్లాడి శాంతింపజేశారు.