రూ.1.4 కోట్లు వసూలు చేసిన ఈవీకే ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్
బాధితుల ఫిర్యాదు..కేసు నమోదు
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 2 (నమస్తే తెలంగాణ): ఫ్రీ లాంచ్ ఆఫర్లో శంకర్‌పల్లిలో తక్కువ ధరకు విల్లా అంటూ నమ్మించి ఇద్దరిని నుంచి ఓ రియల్ ఎస్టేట్ సంస్థ రూ.1.4 కోట్లు టోకరా వేసింది. బాధితులు నెల క్రితం జూబ్లీహిల్స్ పీఎస్‌లో ఫిర్యాదు చేయడంతో అక్కడ నమోదైన కేసు తాజాగా సీసీఎస్‌కు బదిలీ అయ్యింది. నారాయణగూడకు చెందిన కే రాఘవేంద్ర ఇల్లు, విల్లా కొనాలనే ఉద్దేశంతో ఆన్లైన్లో ఈవీకే ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో వచ్చిన ప్రకటనలు చూశాడు. జూబ్లీహిల్స్‌లోని ఆ సంస్థ కార్యాలయానికి వెళ్లి వివరాలు తెలుసుకున్నాడు. ఈవీకే ప్రాజెక్ట్స్ శంకర్పల్లి మొకిలలో ఈవీకే-శ్రీ శిల్ప పేరుతో విల్లాలు నిర్మిస్తుందని, తక్కువ ధరకు ఇస్తామంటూ నమ్మించారు. శంకర్‌పల్లికి తీసికెళ్లి అక్కడ ఒక స్థలాన్ని చూపించి ఇక్కడే విల్లాల నిర్మాణం జరుగుతుందని నమ్మించారు. వారి మాటలను నమ్మిన రాఘవేంద్ర, మరో వ్యక్తి అనిల్ ఎస్ఎఫ్టీ రూ.4,500 చొప్పున కొనుగోలుకు ఒప్పందం చేసుకున్నారు. బాధితులిద్దరు అడ్వాన్స్‌గా ఒక్కొక్కరు రూ.70 లక్షల చొప్పున రూ.1.4 కోట్లు సంస్థ నిర్వాహకులకు చెల్లించారు.
ఇంటి నిర్మాణం జరుగుతుందని త్వరలోనే కొత్త ఇంట్లోకి వెళ్తామనే ఆలోచనలో బాధితులన్నారు. ఒక రోజు ఫ్యామిలీ ఫంక్షన్ ఉండటంతో రాఘవేందర్, అనిల్ కుటుంబసభ్యులతో కలిసి విల్లా నిర్మాణం జరుగుతుందని భావిస్తున్న మొకిలకు వెళ్లారు. అక్కడ ఎలాంటి నిర్మాణం లేకపోవడంతో కంగుతిన్నారు. తిరిగి జూబ్లీహిల్స్‌లోని కార్యాలయానికి వచ్చి జరిగిన మోసంపై నిలదీశారు. అక్కడ కొంత నష్టం వచ్చిందని, ఆరు నెలల్లో మీ డబ్బులు తిరిగి చెల్లిస్తామంటూ చెప్పారు. రేపు, మాపు అంటూ.. కాలయాపన చేయడంతోపాటు డబ్బులు ఇవ్వబోమని, ఏమి చేసుకుంటారో సంస్థ నిర్వాహకులు బెదిరింపులకు దిగడంతో బాధితులు జూబ్లీహిల్స్‌లో ఠాణాలో ఫిర్యాదు చేశారు. దాంతో సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్‌రావు, డైరెక్టర్లు గుంటుపల్లి పద్మజ, వంశీకృష్ణ చౌదరి ఇదర, అనుష గుంటుపల్లి, గుంటుపల్లి సమంతపై కేసు నమోదు చేశారు. ఈ కేసు సీసీఎస్‌కు బదిలీ కావడంతో తాజాగా సీసీఎస్‌లో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.