TPCC chief : కాంగ్రెస్ పార్టీ (Congress Party) లో క్రమశిక్షణే ప్రధానమని, ఎంతటి వారైనా హద్దులు దాటి మాట్లాడితే చర్యలు తీసుకుంటామని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై కొండా సుస్మిత (మంత్రి కొండా సురేఖ కుమార్తె) చేసిన వ్యాఖ్యలపైన, కాంగ్రెస్ ఎమ్మెల్యే గురించి సీనియర్ నేత చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలపైన మహేశ్‌కుమార్ గౌడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.
పార్టీ విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడినందుకుగాను వారికి ఇప్పటికే షోకాజ్ నోటీసులు జారీచేసి వివరణ కోరామని తెలిపారు. వారు ఇచ్చే వివరణ ఆధారంగా క్రమశిక్షణా కమిటీ చర్యలు ఉంటాయని, క్రమశిక్షణా కమిటి సిఫార్సుల మేరకు తగిన చర్యలు ఉంటాయని చెప్పారు. ఎవరికి వారు తమకు తామే అభ్యర్థులుగా ప్రకటించుకోవడం సరికాదని చురకలంటించారు. కాంగ్రెస్‌లో సీట్ల కేటాయింపునకు స్పష్టమైన నియమావళి, ఎన్నికల కమిటీలు ఉంటాయని, అందరూ పార్టీ నిర్ణయానికే కట్టుబడి ఉండాలని స్పష్టంచేశారు.
ఏ నియోజకవర్గం నుంచి ఎవరు అభ్యర్థి అనేది తమ పార్టీలో ముందే ఖరారు కాదని మహేశ్‌కుమార్ గౌడ్ చెప్పారు. ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి ఏదైనా నియోజకవర్గానికి అభ్యర్థిని ప్రకటించినా అందుకు గ్యారంటీ ఉండదని అన్నారు. అభ్యర్థుల ఖరారు విషయంలో పార్టీ హైకమాండ్‌దే తుది నిర్ణయమని తెలిపారు. 22ఏ భూముల వ్యవహారంలో కింది స్థాయిలో జరిగిన పొరపాటుపై ప్రతిపక్షాలు కావాలనే బురద జల్లుతున్నాయని మండిపడ్డారు. ఈ విషయం తమ ప్రభుత్వం దృష్టికి రాగానే సరిదిద్దాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు.