Gas Subsidy | హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తేతెలంగాణ): అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని ఆర్భాటంగా ప్రకటించిన రేవంత్ ప్రభుత్వం ఆచరణలో విఫలమవుతున్నది. ఇందుకు రూ.500కే సబ్సిడీ గ్యాస్ స్కీమే నిదర్శనంగా నిలుస్తున్నది. ఈ పథకం ప్రారంభమై ఎనిమిది నెలలు గడిచినా అర్హులందరికీ అందడంలేదు.
ప్రభుత్వం ఫిబ్రవరి 27న రూ. 500కే సిలిండర్ పథకానికి శ్రీకారం చుట్టింది. తెల్లరేషన్ కార్డులు ఉన్నవారందరికీ వర్తింపజేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ఈ సందర్భంగా ప్రకటించారు. ఎనిమిది నెలలు కావస్తున్నా ఈ హామీ ఆచరణకు నోచుకోలేదు. రాష్ట్రవ్యాప్తంగా 89.9లక్షల మందికి తెల్ల రేషన్‌కార్డుదారులు ఉండగా, 1.20 మందికి గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. సర్కారు నిబంధనల ప్రకారం 64లక్షల మంది లబ్ధిదారులను ఈ పథకానికి అర్హులుగా గుర్తించారు. అయితే ఈ స్కీం కోసం 58 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. సుమారు 5 లక్షల మంది మొదటి విడతలో అర్జీలు పెట్టలేకపోయారు. మొదట 39.9 లక్షల మందికి ఈ స్కీంను వర్తింపజేశారు. మళ్లీ దరఖాస్తులు స్వీకరించి ఆగస్టులో మరో 4.46లక్షల మంది లబ్ధిదారులను చేర్చారు. అంటే మొత్తంగా సుమారు 44.1లక్షల మందికే వర్తింపజేస్తున్నారు. మిగిలిన 20 లక్షల మంది గ్యాస్ సబ్సిడీ పథకం అందడంలేదు.
గ్యాస్ సబ్సిడీ పథకాన్ని అర్హులందరికీ వర్తింపజేసేందుకు ఏటా సుమారు రూ. 4వేల కోట్లు ఖర్చుచేయాల్సి వస్తుందని పౌరసరఫరాల శాఖ అధికారులు అంచనా వేశారు. అంటే ప్రతినెలా రూ.333కోట్లు వెచ్చించాల్సి ఉంటుంది. అధికారంలోకి వచ్చేందుకు అడ్డగోలు హామీలిచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత మొత్తాన్ని వ్యయం చేసే పరిస్థితుల్లో లేదు. అంచనా వేసిన బడ్జెట్లో కేవలం సగం మాత్రమే ఖర్చు చేస్తున్నది. ఈ పరిస్థితుల్లో ఆర్థిక భారాన్ని తప్పించుకొనేందుకే గ్యాస్ సబ్సిడీ స్కీం లబ్ధిదారుల్లో కోతలు విధిస్తున్నదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక లబ్ధిదారులకు సబ్సిడీ నగదు రెండు రోజుల్లోనే జమయ్యేలా చూస్తామని సీఎం ప్రకటించారు. రెండు, మూడు నెలల పాటు ఆయిల్ కంపెనీలకు రాయితీ డబ్బులు ఇస్తామని, తర్వాత నేరుగా అబ్ధిదారుల ఖాతాల్లోనే జమ చేస్తామని చెప్పారు. కానీ సిలిండర్ పొందిన వారం, పది రోజులకు గానీ నగదు ఖాతాల్లో పడడంలేదని లబ్ధిదారులు వాపోతున్నారు. గ్యాస్ ఏజెన్సీలు, ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.