హైదరాబాద్, జనవరి 26 (నమస్తే తెలంగాణ): పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన నార్లాపూర్ రిజర్వాయర్ ప్యాకేజీ 2 పనుల అంచనా వ్యయాన్ని రూ.336 కోట్లకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయించింది. పీఆర్ఎల్ఎస్ఐ చేపట్టిన నార్లాపూర్ రిజర్వాయర్‌కు సంబంధించి ప్యా కేజీ 2 పనులకు రూ. 1,448 కోట్లకు ప్రభుత్వం గతంలో పరిపాలనా అనుమతులను మంజూరు చేసింది. ఈ పనులను ఓ మంత్రి రక్తసంబంధీకుల సంస్థ టెండర్ దక్కించుకుంది. ప్యాకేజీ 2కు సంబంధించి పనుల్లో మార్పుల కారణంగా రూ.89 కోట్లు అంచనా వ్యయం పెరిగిందని, ప్రైస్ ఎస్కలేషన్లు, జీఎస్టీ, తదితర సెస్సులతో అంచనా వ్యయం దాదాపు రూ.336 కోట్లు పెరిగిందని సదరు సంస్థ ప్రతిపాదించింది. దీంతో అంచనా వ్యయం రూ.1,448 కోట్ల నుంచి రూ.1,786 కోట్లకు పెరిగింది.
ప్యాకేజీ 3 పాత రేట్ల ప్రకారమే!
ప్యాకేజీ 3లో భాగంగా నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి ఏదుల రిజర్వాయర్ వరకు 8.32 కిలోమీటర్ల ప్రధాన కాలువ తవ్వాల్సి ఉంది. ఇప్పటివరకు 4.3 కి.మీ వరకు తవ్వకం పూర్తయింది. మరో 4 కి.మీ మేర తవ్వాల్సి ఉంది. ఈ పనులకు తొలుత రూ.416 కోట్ల వ్యయమవుతుందని అంచనా వేశారు. కాలువ తవ్వకానికి బండ రాయి అడ్డుపడింది. దానిని తొలగించాల్సిన నేపథ్యంలో అం చనా వ్యయం రూ.784 కోట్లకు పెరిగిం ది. ఈ మేరకు ప్రతిపాదనలను పంపిం చగా, ప్రభుత్వం తిరస్కరించింది.