హైదరాబాద్, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): వివిధ అంశాలపై చర్చ, సెమినార్లు, చట్టాలు, ప్రభుత్వ ఉత్తర్వులపై అధ్యయనం, సభ్యులతో సమన్వయం తదితర వాటికి వేదికగా ఉన్న ఇండియన్ పార్లమెంటరీ గ్రూప్ తరహాలో ‘తెలంగాణ పంచాయతీరాజ్ గ్రూప్’ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నదని రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్‌కుమార్ అభిప్రాయపడ్డారు. సోమవారం హైదరాబాద్‌లోని బాబూజగ్జీవన్ భవన్లో స్థానిక సంస్థల మాజీ ప్రజాప్రతినిధుల సంఘం అధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన వినోద్ మాట్లాడుతూ.. సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, జడ్పీటీసీ సభ్యులుగా నిత్యం ప్రజా సేవలో ఉండే స్థానిక సంస్థల ప్రస్తుత, మాజీ ప్రజాప్రతినిధులు కలిసి ‘తెలంగాణ పంచాయతీరాజ్ గ్రూప్’ను చట్టబద్ధంగా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
పంచాయతీరాజ్ చట్టాలు, ప్రభుత్వ ఉత్తర్వులపై సమీక్షలు, సెమినార్లు, స్థానిక ప్రజాప్రతినిధులతో సమన్వయం, చర్చలు తదితర వాటికి ఈ గ్రూప్ వేదికగా ఉండాలని పేర్కొన్నారు. ఈ వేదిక ద్వారా వచ్చే ఫీడ్ బ్యాక్‌ను చట్టసభల సభ్యుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. లోక్‌సభ స్పీకర్ అధ్యక్షుడిగా ఇండియన్ పార్లమెంటరీ గ్రూప్ 1949లో ఏర్పాటైందని, దీనికి బీఆర్ అంబేదర్ శ్రీకారం చుట్టారని గుర్తుచేశారు. ప్రజాప్రతినిధులంతా సోషియల్ ఇంజినీర్లేనని, నిర్మాణాల్లో ఇంజినీర్ల పాత్ర ఎలాంటిదో సమాజ నిర్మాణంలో కూడా ప్రజాప్రతినిధుల పాత్ర అంతేనని అన్నారు.
ప్రస్తుత, మాజీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు అందించాలని సూచించారు. స్థానిక సంస్థల మాజీ ప్రజాప్రతినిధుల డిమాండ్లు అయిన హెల్త్ కార్డులు, రాయితీపై బస్‌పాసులు, డబుల్ బెడ్రూం ఇండ్ల మంజూరు విషయాలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిషారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల మాజీ ప్రజాప్రతినిధుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శంకర్, ప్రతినిధులు సుధాకర్‌రెడ్డి, చంద్రారెడ్డి, గోపాల్‌గౌడ్, తులసీ, ప్రమీల, లావణ్య పాల్గొన్నారు.