హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ): ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఈ నెల 11 నుంచి 18లోపు వ్యాసరచన పోటీలు నిర్వహించాలని జిల్లా విద్యాశాఖ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఎస్సీఈఆర్టీ నిర్వహించే ఈ పోటీల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు జిల్లా స్థాయిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతుల కింద రూ.500, రూ.300, రూ.200 నగదు బహుమతులు ఇవ్వాలని శుక్రవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
జిల్లా స్థాయిలో ప్రథమ బహుమతి పొందిన విద్యార్థులు ఈ నెల 18న రాష్ట్రస్థాయి పోటీలకు అర్హులని పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో మహిళా సాధికారత, అంటువ్యాధులు, సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయడం, కౌమార దశ సమస్యలు, ప్రపంచ వ్యాప్తంగా ఆకలి సమస్యకు కారణాలు, పరిష్కారాలు అనే అంశాలపై వ్యాసరచన పోటీలను తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ భాషల్లో నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.