మడికొండ, అక్టోబర్ 11: హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం అనంతసాగర్లోని ఎస్సార్ యూనివర్శిటీ (ఎస్ఆర్యూ)కి ప్రపంచ స్థాయి గుర్తింపు లభించింది. ప్రపంచ ప్రఖ్యాత టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ (టీహెచ్ఈ) వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2026లో 801- 1000 బ్యాండ్లో స్థానం సాధించింది. దేశంలోనే అనతికాలంలో ఈ గ్లోబల్ ర్యాంకింగ్స్లో చోటు దకిన విశ్వవిద్యాలయంగా ఎస్ఆర్యూ గుర్తింపు పొందింది. ఇటీవల వెలువడిన ఎన్ఐఆర్ఎఫ్-2025 ర్యాంకింగ్స్లో కూడా ఎస్సార్ యూనివర్సిటీ ఇంజినీరింగ్ విభాగంలో 91వ స్థానం, విశ్వవిద్యాలయ విభాగంలో 101-150 బ్యాండ్లో నిలిచింది.
అమెరికా తర్వాత అత్యధిక విశ్వవిద్యాలయాలు ర్యాంక్ పొందిన దేశంగా భారత్ రెండో స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో ఎస్ఆర్యూ ఇండియాలో టాప్ 28, ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో 10వ స్థానం, అలాగే తెలంగాణలో టాప్ 1000లో చోటు దకిన ఏకైక ప్రైవేట్ యూనివర్సిటీగా నిలిచింది. బోధన, అభ్యాసంలో అత్యుత్తమ ప్రమాణాలను పాటించడం వల్లే ప్రపంచ స్థాయిలో గుర్తింపు లభించిందని ఎస్ఆర్యూ చాన్స్లర్ వరదారెడ్డి తెలిపారు.
శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. విద్యార్థులను పరిశ్రమకు తగిన నైపుణ్యాలతో తీర్చిదిద్దడం, అధ్యాపకుల నాణ్యతపై దృష్టి పెట్టడం తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ దీపక్గార్గ్ మాట్లాడుతూ ఈ ర్యాంకింగ్ ఎస్ఆర్యూకు బలమైన విద్యా ప్రాతిపదిక, అంతర్జాతీయ దృష్టికోణానికి నిదర్శనమని పేర్కొన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో అనుభవం గల అధ్యాపకులను నియమించడం, పరిశోధన నాణ్యత, ఇన్నోవేషన్, సహకారాలపై దృష్టి పెట్టడం వల్లే ఈ గుర్తింపు సాధ్యమైందని తెలిపారు. సమావేశంలో వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ వీ మహేశ్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పీవీ రమణారావు, గ్రోత్ అండ్ ఆపరేషన్స్ డీన్ ప్రొఫెసర్ ఆర్ అర్చనారెడ్డి, డైరెక్టర్ ఐక్యూఏసీ ప్రొఫెసర్ పీవీ రాజశేఖర్ పాల్గొన్నారు.