హైదరాబాద్, జూలై 29 (నమస్తే తెలంగాణ): విద్యుత్తు చట్టం కింద ఏర్పాటైన ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ల ఫోరం (ఈఆర్ఎఫ్) దేశవ్యాప్తంగా ఉన్న విద్యుత్తు నియంత్రణ సంస్థల మధ్య సమన్వయాన్ని పెంపొందించడంలో బలమైన వేదికగా పనిచేస్తున్నదని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ (సీఈఆర్సీ) చైర్మన్ జిష్ణు బారువా తెలిపారు. దేశంలోని అన్ని రాష్ర్టాల విద్యుత్తు నియంత్రణ మండళ్ల (ఈఆర్సీ) చైర్మన్లు సభ్యులుగా ఉన్న ఈఆర్ఎఫ్ 92వ సమావేశాన్ని హైదరాబాద్‌లోని ప్రగతిరిసార్ట్స్లో సోమవారం నిర్వహించారు.
దేశవ్యాప్తంగా విద్యుత్త్తు నియంత్రణ చట్టం అమలు, డిస్కంలు తీసుకుంటున్న చర్యలపై ఈ భేటీలో చర్చించారు. జిష్ణు బారువా మాట్లాడుతూ.. విద్యుత్తు సరఫరాలో పంపిణీ సంస్థల హక్కులు, బాధ్యతలను ఈఆర్ఎఫ్ గుర్తుచేస్తున్నదని, ఈ ఫోరం అత్యున్నతస్థాయి సమావేశాన్ని తొలిసారి హైదరాబాద్‌లో నిర్వహించడం గొప్ప విషయమన్నారు. అవగాహన కల్పించేందుకు అన్ని జిల్లాల్లో సదస్సులు నిర్వహిస్తున్నట్టు టీజీఈఆర్సీ చైర్మన్ రంగారావు తెలిపారు.అన్ని రాష్ర్టాల ఈఆర్సీ చైర్మన్లు, జేఈఆర్ కమిషన్ చైర్పర్సన్లు పాల్గొన్నారు.
సుబేదారిగంజ్-సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లు
హైదరాబాద్, జూలై 29 (నమస్తే తెలంగాణ) : దక్షిణ మధ్య రైల్వే జోన్ ఆధ్వర్యంలో సుబేదారిగంజ్-సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ల మధ్య రెండు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసినట్టు రైల్వే అధికారులు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆగస్టు 1 నుంచి 31 వరకు ప్రత్యేక రైళ్ల రాకపోకలు కొనసాగుతాయని తెలిపారు. కాచిగూడ-రాయ్‌చూర్, గద్వాల్-రాయ్‌చూర్ రైల్వే స్టేషన్ల మధ్య నాలుగు రైళ్లను ఈ నెల 30 నుంచి ఆగస్టు 31 వరకు పునరుద్ధరించనున్నట్టు వెల్లడించారు.