హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ‘గృహజ్యోతి’ పథకం అమలుపై విద్యుత్తు నియంత్రణ చట్టం ప్రకారమే ఉత్తర్వులిచ్చామని తెలంగాణ విద్యుత్తు నియంత్రణ మండలి (ఈఆర్సీ) తెలిపింది. విద్యుత్తు చట్టం-2003లోని సెక్షన్ 108 ప్రకారం.. విద్యుత్తు పంపిణీ సంస్థలకు ముందుగా అడ్వాన్స్ చెల్లించిన తర్వాతే జీరో బిల్లులు జారీచేయాల్సి ఉన్నదని, ఈ నేపథ్యంలో డిస్కంలకు సుమోటోగా డిస్కంలకు ఆదేశాలిచ్చామే తప్ప ప్రభుత్వానికి కాదని స్పష్టం చేసింది. విద్యుత్తు చట్టం-2003లోని సెక్షన్ 63 ప్రకారం.. గృహజ్యోతి లబ్ధిదారులకు జారీచేస్తున్న జీరో బిల్లుల సబ్సిడీని తామే విడుదల చేస్తామని రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా లేఖ రాసిందని, దీనినే ఉత్తర్వుల్లో ప్రస్తావించామని పేర్కొన్నది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇటీవల ఈఆర్సీ చైర్మన్ తన్నీరు రంగారావుపై పలు ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఈఆర్సీ సోమవారం ఓ ప్రకటన ద్వారా ఈ వివరణ ఇచ్చింది.
ప్రజా ప్రయోజనాల దృష్ట్యానే..
పక్షపాతం లేకుండా చిత్తశుద్ధితో విధులను నిర్వర్తిస్తున్నామని, తమ నిబద్ధతను ఎవరూ శంకించలేరని ఈఆర్సీ పేర్కొన్నది. రైతుల ఉచిత విద్యత్తు కనెక్షన్లకు మీటర్లు లేక వినియోగాన్ని రికార్డు చేయడం లేదని, అందుకే డిస్కంలు జీరో బిల్లులు జారీచేయకుండా 6 నెలలకోసారి కస్టమర్ చార్జీల ప్రకారం విద్యుత్తు బిల్లులను జారీచేస్తున్నాయని వెల్లడించింది. ఎస్సీ, ఎస్టీలతోపాటు క్షౌరశాలలు, లాండ్రీలు, ధోబీ ఘాట్లకు కూడా జీరో బిల్లులు జారీచేయడం లేదని, రీయింబర్స్మెంట్ ద్వారా వచ్చిన మొత్తానికే బిల్లు మొత్తాన్ని తీస్తోందని తెలిపింది. ‘గృహజ్యోతి’కి సంబంధించి తామిచ్చిన ఆదేశాలపై అభ్యంతరాలుంటే కమిషన్ ముందు అప్పీలు చేసుకోవచ్చని ఈఆర్సీ తెలిపింది.