Makthal | మక్తల్, నవంబర్ 10: ఎన్నికల వేళ కాంగ్రెస్ ప్రకటించిన హామీల అమలు పై కులగణన సర్వేకు వెళ్లిన ఎన్యూమరేటర్లను ప్రజలు ప్రశ్నిస్తు న్నారు. నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీలోని మూడో వార్డులో ఆదివారం ఎన్యూమరేటర్లు కులగణన సర్వే చేపట్టారు. ఈ క్రమంలో వృద్ధురాలు నరసమ్మ ఎన్యూమరేటర్లతో మాట్లాడుతూ.. ‘కేసీఆర్ ప్రభుత్వంలో ఇస్తున్నటువంటి రూ.2 వేల పింఛన్ మాత్రమే వస్తున్నది. రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం రూ.4 వేలు పింఛన్ ఇవ్వకుండా ప్రజలను మభ్యపెట్టేందుకు కులగణన సర్వే చేపట్టడం ఎంతవరకు సమంజసం’ అని ప్రశ్నించారు.
ప్రజల్లో భయాలకు ప్రభుత్వమే కారణం
హైదరాబాద్, నవంబర్10 (నమస్తే తెలంగాణ): సర్వేపై ప్రజల్లో నెలకొన్న భయాలకు రాష్ట్ర ప్రభుత్వ వైఖరే కారణమని బీఆర్ఎస్ నాయకుడు వై సతీశ్‌రెడ్డి ఆదివారం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. కులగణన కోసం ఆధార్‌కార్డ్, స్థిరచరాస్థి, రాజకీయ, రుణాలు, భూమి పత్రాలు, ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్, ఏసీలు, బైక్‌లు, కార్ల వివరాలు ఎందుకని ప్రశ్నించా రు. కులం, వృత్తివివరాలు సేకరిస్తే సరిపోతుంది కదా అని పేర్కొన్నారు. సరైన సమాధానం చెప్పకుండా ఎన్యూమరేటర్లు వ్యవహరిస్తున్నారని, అందుకే ప్రజలు వీడియోలు తీస్తున్నారని తెలిపారు. వీడియోలు తీసేవారిపై కేసు పెట్టాలని భావిస్తే మొదట కేసు పెట్టాల్సింది ఇంత గందరగోళ పరిస్థితికి కారణమైన సీఎం, మం త్రుల మీదే పెట్టాలని తెలిపారు.