హైదరాబాద్, మార్చి 1 (నమస్తే తెలంగాణ): తెలంగాణలోని నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెంలో శరవేగంగా నిర్మితమవుతున్న యాదాద్రి థర్మల్ విద్యుత్తు కేంద్రానికి సత్వరమే పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని బీఆర్ఎస్ లోక్‌సభా పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యులు దీవకొండ దామోదరావు, బడుగుల లింగయ్యయాదవ్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు వారు న్యూఢిల్లీలోని కేంద్ర పర్యావరణశాఖ అదనపు కార్యదర్శి తన్మయ్కుమార్ను బుధవారం ప్రత్యేకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని అంశాలపై సమగ్రంగా చర్చించి, సమగ్ర వివరాలతో కూడిన ఓ లేఖను అందజేశారు. రూ.29,965.48 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ కేంద్రంలో ఇప్పటికే రూ.20 వేల కోట్లకు పైగా ఖర్చు చేసి, 64.20 శాతం మేర పనులను ప్రభుత్వం పూర్తి చేసిందని వివరించారు. మిగతా పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. పరిసర గ్రామాల ప్రజలు ప్రాజెక్టు నిర్మాణానికి సంపూర్ణ మద్దతు తెలిపారని అదనపు కార్యదర్శికి వివరించారు. విద్యుత్తు ప్రాజెక్టు పూర్తయితే తెలంగాణ రాష్ట్రానికి కరెంట్ లోటు ఉండదని వివరించారు. మొదటి రెండు యూనిట్లను ఆగస్టు 23 నాటికి, మిగతా యూనిట్లను 2024 మార్చి నాటికి పూర్తి చేసేలా తెలంగాణ ప్రభుత్వం అన్నిరకాల చర్యలు తీసుకున్నదని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో దూరదృష్టితో ఈ పాజెక్టును నిర్మిస్తున్నారని, దీనికోసం తెలంగాణ ప్రజలు వేనోళ్ల ఎదురు చూస్తున్నారని తన్మయ్కుమార్కు ఎంపీలు వివరించారు.