హైదరాబాద్, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ): టీఎస్ ఎంసెట్‌కు దరఖాస్తు చేస్తున్నారా.. మీ ఇంటర్ సెకండియర్ హాల్‌టికెట్ నంబర్‌ను ఎంటర్చేయండి అంతే.. మీ వివరాలు ప్రత్యక్షమవుతాయి. సులభమైన పద్ధతిలో దరఖాస్తుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇంటర్ హాల్‌టికెట్లతో ఎంసెట్ దరఖాస్తులను అనుసంధానించారు. అయితే వెబ్సైట్లో ప్రత్యక్షమైన వివరాలను విద్యార్థులు ఒకసారి పరిశీలించుకోవాలని సూచిస్తున్నారు.
టీఎస్ ఎంసెట్ దరఖాస్తుల ప్రక్రియ ఈ నెల 6 నుంచి మే 28వ తేదీ వరకు కొనసాగనున్నది. అపరాధ రుసుములతో జూన్ 17వరకు అవకాశం ఉన్నది. దరఖాస్తుల స్వీకరణకు జేఎన్టీయూ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఇప్పటికే ఇంటర్‌బోర్డు సైన్స్ విద్యార్థులకు ప్రాక్టికల్స్ కోసం హాల్‌టికెట్లను జారీచేసింది. ఒకవేళ ఇంటర్ సెకండియర్ హాల్‌టికెట్ నంబర్, పరీక్ష రాయబోయే మీడియం తప్పుగా నమోదుచేస్తే, విద్యార్థి లేఖ రాసి సంతకం చేసి స్కాన్ చేశాక, సెకండియర్ హాల్‌టికెట్ జిరాక్స్‌ను జత పరిచి, హెల్ప్‌లైన్ మెయిల్ ఐడీ convener.eamcet@tsche. ac.inకు పంపించి సరిచేసుకోవచ్చని వివరించారు.
ఈ బటన్లు నొక్కరాదు
ఆన్లైన్ పేమెంట్, దరఖాస్తు సమయంలో బ్యాక్, రిఫ్రెష్ వంటి బటన్లు ఎట్టిపరిస్థితుల్లో నొక్కరాదు. దీంతో ఫీజు చెల్లింపు, దరఖాస్తు ప్రక్రియకు అటంకం కలుగుతున్నది. డెబిట్‌కార్డు/ క్రెడిట్‌కార్డు ద్వారా ఫీజు చెల్లించే వారు ప్రక్రియ పూర్తయ్యే వరకు వేచిచూడాలి.
ధ్రువీకరణ పత్రాల సమర్పణ
ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు దరఖాస్తుతో పాటు, కుల ధ్రువీకరణ పత్రాన్ని ప్రవేశ పరీక్ష రోజున ఎగ్జామినర్‌కు అందజేయాలి. అయితే ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కోటా విద్యార్థులు రిజర్వేషన్ వర్తింపు కోసం ధ్రువీకరణ పత్రాలను అడ్మిషన్/కౌన్సెలింగ్ సమయంలో సమర్పించాలి.
హెల్ప్డైస్క్లు
ఎంసెట్ విద్యార్థులకు జేఎన్టీయూ అధికారులు ఈమెయిల్: convener.eamcet@ tsche.ac.in, 8522018533/ 9866937564 అనే హెల్ప్‌డెస్క్‌లను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా తమ సమస్యలను పరిష్కరించుకోవచ్చు.