హైదరాబాద్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ): వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఇంగ్లిష్ మీడియంలో బోధనపై ఉపాధ్యాయులకు ఇస్తున్న శిక్షణ ముగింపు దశకు చేరుకొన్నది. 30 రోజుల్లోనే 80 వేల పైచిలుకు టీచర్లకు అధికారులు శిక్షణనిచ్చారు. సబ్జెక్టు టీచర్లకు అజీం ప్రేమ్జీ యూనివర్సిటీ రూపొందించిన ఇంగ్లిష్ లాంగ్వేజ్ ఎన్రిచ్మెంట్ కోర్సులో శిక్షణ ఇప్పిస్తున్నారు. మొత్తం ఐదు విడతల్లో శిక్షణకు షెడ్యూల్ను రూపొందించారు. ప్రాథమిక పాఠశాలల టీచర్లకు 3, ఉన్నత పాఠశాలల టీచర్లకు 2 విడతల్లో శిక్షణ ఇస్తున్నారు. ఇప్పటికే నాలుగు విడతల శిక్షణ పూర్తయింది. ఉన్నత పాఠశాలల టీచర్లకు ఇస్తున్న తుది విడత శిక్షణ ఈ నెల 18వ తేదీతో ముగియనున్నది. ఆ తర్వాత ఆన్లైన్లోనూ శిక్షణ ఇస్తారు. ఆన్లైన్ శిక్షణ నిరంతరం కొనసాగుతుందని ఎస్సీఈఆర్టీ అధికారులు తెలిపారు.