Intermediate | హైదరాబాద్, జూలై 5 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని ఇంటర్ విద్యార్థులకు ఇంగ్లిష్ ప్రాక్టికల్స్ నిర్వహించాలని ఇంటర్‌బోర్డు నిర్ణయించింది. ఇందుకు ఇంటర్నేషనల్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ టెస్టింగ్ సిస్టం (ఐఈఎల్టీఎస్) తరహా సిలబస్, యాక్టివిటీస్‌తో కూడిన కరదీపికను రూపొందించింది. తెలుగు అకాడమీ ద్వారా ఈ కరదీపికను ముద్రించనున్నారు. ఇకనుంచి ఇంగ్లిష్ లెక్చరర్లంతా ఆయా కరదీపిక ప్రకారమే ప్రాక్టికల్స్ నిర్వహించాలి. ఇంగ్లిష్ మాతృభాషగా ఉన్న దేశాల్లో చదువుకోవాలన్నా, పనిచేయాలన్నా ఐఈఎల్టీఎస్ తప్పనిసరి.
ఈ పరీక్ష అత్యంత పకడ్బందీగా నిర్వహిస్తారు. వినడం, మాట్లాడటం, రాయడం, చదవడంలో పలు అంశాలను పరీక్షిస్తారు. ఇంగ్లిష్ ల్యాబ్‌లు ఏర్పాటుచేసి, వాటిల్లో విద్యార్థుల నైపుణ్యాలను పరీక్షిస్తారు. విద్యార్థుల ఉచ్ఛారణ, వాక్యనిర్మాణం, వ్యాకరణ దోషాలను సరిచేస్తారు. ఇదేతరహాను ప్రాక్టికల్స్‌లో కూడా అమలుచేయాలని అధికారులు నిర్ణయించారు.
ఇంటర్లో ఇంగ్లిష్ ఎగ్జామ్‌ను ఇదివరకు 100 మార్కులకు నిర్వహించేవారు. తాజా విధానంలో 80 మార్కులు థియరీ, 20 మార్కులు ప్రాక్టికల్స్‌కు ఉంటాయి. ప్రస్తుతం ఇంటర్ సైన్స్, వొకేషనల్ విభాగం విద్యార్థులకు సెకండియర్లోనే ప్రాక్టికల్స్ నిర్వహిస్తున్నారు. ఇదేతరహాలో ఫస్టియర్లోని ఆర్ట్స్, సైన్స్, వొకేషనల్ విద్యార్థులకు ఇంగ్లిష్‌లో ప్రాక్టికల్స్ అమలుచేస్తారు. దీంతో ఫస్టియర్‌లో ఇంగ్లిష్, సెకండియర్‌లో సైన్స్ సబ్జెక్టులకు ప్రాక్టికల్స్ ఉంటాయి.