హైదరాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ పాఠశాలల తరహాలోనే రాష్ట్రంలోని అన్ని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో (కేజీబీవీ) కూడా ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టనున్నారు. రాష్ట్రంలో మొత్తం 475 కేజీబీవీలు ఉన్నాయి. వీటిల్లో 264 కేజీబీవీల్లో ఇప్పటికే ఇంగ్లిష్ మీడియం ద్వారా బోధిస్తున్నారు. మిగిలిన 211 బడుల్లో కూడా వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఆంగ్ల మాధ్యమంలో బోధించనున్నారు.
కేజీబీవీల్లోని సబ్జెక్టు (లాంగ్వేజ్ టీచర్లు మినహాయించి) టీచర్లకు జిల్లా కేంద్రాల్లో జూన్ ఒకటి నుంచి ఐదు వరకు ప్రత్యక్ష పద్ధతిలో శిక్షణ ఇస్తారు. 1,600 మంది టీచర్లకు అజీం ప్రేమ్జీ వర్సిటీ రూపొందించిన ఇంగ్లిష్ లాంగ్వేజ్ ఎన్రిచ్మెంట్ కోర్సు పూర్తిచేయించి, ఇంగ్లిష్ మీడియం బోధనకు వీలుగా సన్నద్ధం చేస్తారు.