హైదరాబాద్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ): ఇంటర్ కాగానే చాలామంది ఇంజినీరింగ్ పూర్తి చేసి తనకు నచ్చిన ఉద్యోగంలో స్థిరపడటమో లేదా ఎంటెక్‌లో చేరుతుంటారు. ఆ రంగంలో ఉన్న అవకాశాలను వినియోగించుకొంటారు. కానీ బీటెక్ పూర్తి చేసిన వారు న్యాయవాద (లా) కోర్సుల్లో చేరుతున్నారు. కొంత ఆశ్చర్యమే అయినా గత రెండేండ్లుగా జరుగుతున్న అడ్మిషన్లు ఇదే విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి. ప్రస్తుతం లా కోర్సుల్లో చేరేందుకు కౌన్సెలింగ్ జరుగుతుండగా, మొదటి విడతలో 1,674 మంది (26 శాతం) బీటెక్ అభ్యర్థులు లా కోర్సుల్లో ప్రవేశాలు పొందారు. వీరితోపాటు ఎంబీబీఎస్, బీడీఎస్, బీఆర్క్ తదితర కోర్సుల్లోని వారు కూడా న్యాయవిద్య వైపు మొగ్గుచూపుతున్నారు. గతంలో బీఏ, బీకాం విద్యార్థులు మాత్రమే లా కోర్సుల్లో చేరగా కొంతకాలంగా ట్రెండ్ పూర్తిగా మారుతున్నది.
బీఎస్సీ, ఎంబీబీఎస్, బీడీఎస్ వంటి ముఖ్యమైన వృత్తి విద్యాకోర్సులన్నింటి నుంచి లా కోర్సుల వైపు మళ్లుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. మొదటి విడత కౌన్సెలింగ్‌లోనే ఇంతమంది చేరారంటే, రెండోవిడతలో వీరి సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇంజినీరింగ్‌తోపాటు లా పూర్తిచేసిన వారికి కంపెనీలు క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. జాతీయస్థాయి విద్యాసంస్థల్లో లా కోర్సులు పూర్తిచేసిన వారికి ఆకర్షణీయ వేతనాలతో కార్పొరేట్ కొలువులు స్వాగతం పలుకుతుండటంతో ఈ కోర్సులను ఎంచుకొంటున్నారు. పలు విద్యాసంస్థలు కూడా బీటెక్ ఎల్ఎల్బీ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. యూనివర్సిటీ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ స్టడీస్ ప్రత్యేకంగా బీటెక్ కంప్యూటర్ సైన్స్‌తోపాటు ఎల్ఎల్బీ కోర్సులను అందిస్తున్నది. సైబర్ లా, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ లాలో ఒకదానిని స్పెషలైజేషన్‌గా ఎంచుకొనే అవకాశాన్నిచ్చింది.
ఎందుకి‘లా’అంటే..
లా పూర్తయితే హోదా, గౌరవం దొరుకుతుంది. సమాజంలో పలుకుబడి ఉండటం, వివాదాలు, కేసుల సంఖ్య పెరుగుతుండటం డిమాండ్‌కు కారణమవుతున్నది.
బ్యాంకులు, ఇన్స్యూరెన్స్, పరిశ్రమలు, సాఫ్ట్వేర్, బహుళజాతి కంపెనీలు, కన్సల్టెన్సీ సేవలందించే సంస్థలు, అకౌంటింగ్ కంపెనీలు లీగల్ కన్సల్టెంట్లను, లీగల్ ఆఫీసర్లను నియమించుకుంటుండటం.
ఇటీవల కాలంలో జూనియర్ సివిల్ జడ్జి, లేబర్ ఆఫీసర్ తదితర పోస్టులను పెద్దఎత్తున భర్తీ చేస్తున్నారు. మిగతా ఉద్యోగాలతో పోల్చితే ఈ పోస్టులకు పోటీ తక్కువగా ఉండటం.
సివిల్, క్రిమినల్, ఫ్యామిలీ లా తోపాటు ఇటీవల కంపెనీ, బిజినెస్, మానవహక్కులు, సైబర్‌క్రైం, ఆన్లైన్, ట్యాక్స్, కార్పొరేట్, ఎన్విరాన్మెంట్, కాపీరైట్, పేటెంట్ లా, అర్బిట్రేషన్ వంటి ప్రత్యేక చట్టాలు అందుబాటులోకి వస్తుండటంతో ఈ రంగంలోని వారికి మంచి డిమాండ్ ఉంటున్నది.