Cyber Crime | హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 3 (నమస్తే తెలంగాణ): ఇన్‌స్టాగ్రామ్‌లో అమ్మాయి పేరుతో నకిలీ ఖాతా సృష్టించి, బాలికలు, యువతులతో పరిచయాలు పెంచుకుని, నగ్నఫొటోలు పంపించాలంటూ వేధిస్తున్నాడో ప్రబుద్ధుడు. ఇన్‌స్టాలో పరిచయమైన మహిళల ఫొటోలను మార్ఫింగ్ చేసి వారి జీవితాలతో ఆటలాడుకుంటున్న సైబర్ నేరగాడిని సీసీఎస్ సైబర్‌క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. జాయింట్ సీపీ రంగనాథ్ కథనం ప్రకారం.. మేడ్చల్‌కు చెందిన ఎస్ జిష్ణుకీర్తన్రెడ్డి బీటెక్ చదువుతున్నాడు. అమ్మాయిల పేరుతో ఫేక్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేశాడు. ఆ అకౌంట్ డీపీలో అమ్మాయి ఫొటో పెట్టడంతో అతడిని అమ్మాయిగానే భావించి పలువురు ఫ్రెండ్షిప్ చేశారు. స్నేహ హస్తం చాచిన అమ్మాయిలతో చాటింగ్ చేస్తూ, వారి ఫొటోలు సేకరించేవాడు.
వాటిని మార్ఫింగ్ చేసి వారికే పంపించేవాడు. వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేయకుండా ఉండాలంటే.. ప్రతిరోజూ తనకు నగ్నఫోటోలు, వీడియోలు పంపించాలని బెదిరించేవాడు. , లేదంటే సోషల్‌మీడియాలో పరువు తీస్తానని బెదిరించేవాడు. ఇటీవల ఒక బాలికను ఇలాగే ట్రాప్ చేశాడు. ఆమెకు మార్ఫింగ్ ఫోటోలు పంపించి బెదిరించాడు. ప్రతిరోజూ నగ్నఫొటోలు పంపించకపోతే తన వద్ద ఉన్న ఫొటోలను వైరల్ చేస్తానంటూ బ్లాక్మెయిల్ చేశాడు. బాధితురాలు ఈ విషయాన్ని తన తల్లికి చెప్పింది. దీంతో ఆమె సీసీఎస్ సైబర్‌క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని ఇన్స్పెక్టర్ పద్మ నేతృత్వంలోని బృందం దర్యాప్తు జరిపి, నిందితుడు కీర్తన్రెడ్డిగా గుర్తించి బుధవారం అరెస్ట్ చేశారు. నిందితుడి ఫోన్‌ను సైబర్‌క్రైమ్ పోలీసులు విశ్లేషిస్తున్నారు. ఫేక్ ఐడీతో అనేకమందితో చాటింగ్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఎంతమంది బాధితులు ఉన్నారు? వారు ఎక్కడ ఉంటారనే విషయంపై లోతుగా దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.