Engineering Colleges | హైదరాబాద్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ) : పేరుకు మాత్రం ఇంజినీరింగ్ కాలేజీ.. ఉండేది మాత్రం ఒక్క కోర్సు మాత్రమే. సీట్ల సంఖ్య 60 మాత్రమే. ఇది ఆరు కొత్త ఇంజినీరింగ్ కాలేజీల కథ. ఏడాది కాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ ఫైల్ ఆర్థికశాఖ నుంచి ముందుకు కదలడంలేదు. దీంతో ఈ కాలేజీల మంజూరుపై నీలినీడలు కమ్ముకున్నాయి. కొత్తగా రాష్ట్రంలోని ఆరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలను ఇంజినీరింగ్ కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేసేందుకు విద్యాశాఖ ప్రతిపాదనలు రూపొందించింది. రంగారెడ్డి జిల్లా బడంగ్‌పేట, హైదరాబాద్ జిల్లాలోని మారేడుపల్లి, సికింద్రాబాద్, దుర్గాబాయి దేశ్‌ముఖ్, ఓల్డ్‌సిటీ, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా రామంతాపూర్‌లోని పాలిటెక్నిక్ కాలేజీల అప్‌గ్రేడ్ కోసం ప్రభుత్వానికి ఇంజినీరింగ్ కాలేజీలు ప్రతిపాదనలు సమర్పించాయి.
దీని కోసం ఈ కాలేజీలు ఏఐసీటీఈ నుంచి అనుమతి పొందాల్సి ఉంది. గడువు డిసెంబర్ 9తో ముగిసింది. జరిమానాతో జనవరి 2 నుంచి దరఖాస్తు చేసుకునే అవకాశముంది. ఈ లోపు ఆర్థికశాఖ క్లియరెన్స్ ఇవ్వడం, ప్రభుత్వం కాలేజీలను ఏర్పాటు చేస్తూ జీవోలు జారీచేయాల్సి ఉంది. కొత్త కాలేజీలు కనీసం మూడు, నాలుగు కోర్సులతో కాలేజీని ప్రారంభిస్తేనే అవి మనుగడ సాగించే అవకాశముంటుంది. కానీ ఒకే ఒక్క కోర్సును నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాగా వచ్చే విద్యాసంవత్సరం నుంచి పటాన్చెరులో కొత్తగా ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ అందుబాటులోకి రానుంది. ఈ కాలేజీని మంజూరుచేస్తూ ఇప్పటికే జీవోను జారీచేయగా, 2025-26లో ప్రవేశాలు కల్పిస్తారు. దీంతో ఈ కాలేజీ అందుబాటులోకి వస్తుంది.