డిచ్పల్లి, జూన్ 6: అక్రమ నియామకాలు, నిధుల దుర్వినియోగంతో వివాదంగా మారిన తెలంగాణ యూనివర్సిటీలో మంగళవారం హైదరాబాద్ నుంచి వచ్చిన ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో పరిపాలనా భవనానికి మూడు వాహనాల్లో సుమారు 15 మందికి పైగా వచ్చిన విజిలెన్స్ అధికారులు.. అడ్మినిస్ట్రేషన్ భవనంలోని వీసీ చాంబర్, ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్, అకౌంట్ సెక్షన్, ఇంజినీరింగ్ విభాగాల్లో బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేపట్టారు. ముందుగానే ఆయా విభాగాల్లో పని చేస్తున్న సిబ్బంది సెల్ఫోన్లను, కంప్యూటర్ సీపీయూ, హార్డ్‌డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వాటిని అకౌంట్ సెక్షన్లో పెట్టి అందులోని ఫైళ్లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. వీసీ లేకపోవడంతో పరిపాలనా భవనంలో ఉన్న ఎస్బీఐ బ్యాంకు అధికారులతో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మాట్లాడి యూనివర్సిటీకి సంబంధించిన అన్ని అకౌంట్లలో పూర్తిస్థాయి లావాదేవీల వివరాలను సేకరించారు. కాగా.. మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరిపాలనా భవనంలో ఉన్న వీసీ.. ఎన్ఫోర్స్మెంట్ అధికారులు వస్తున్నారన్న సమాచారం తెలుసుకొని అరగంట ముందుగానే యూనివర్సిటీ నుంచి వెళ్లిపోయారు. ఈ విషయం తెలుసుకున్న ఎన్ఫోర్స్మెంట్ అధికారులు డిచ్పల్లి ఎస్సై గణేశ్‌కు సమాచారం ఇవ్వడంతో వీసీ వాహనాన్ని వెంబడించి భిక్కనూరు టోల్‌ప్లాజా వద్ద పట్టుకున్నారు. ఎన్ఫోర్స్మెంట్ డీఎస్పీ ఆధ్వర్యంలో వైస్‌చాన్స్‌లర్ వాహనంలోనే సుమారు గంట పాటు వీసీని ప్రశ్నించి ఆయన వద్ద ఉన్న ముఖ్యమైన ఫైళ్లను స్వాధీనం చేసుకున్నామని ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ రామచంద్రాపురం యూనిట్ అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్ తెలిపారు.