సిటీబ్యూరో, జనవరి 7 (నమస్తే తెలంగాణ) : కొమురవెల్లి మల్లన్న క్షేత్రంలో బంగారు కిరీటాల తయారీకి దేవాదాయశాఖ ఈ-ప్రొక్యూర్ టెండర్లను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు మల్లికార్జున స్వామి దేవస్థానంలో మేడాలమ్మ, కేతమ్మ అమ్మవార్లకు బంగారు కిరీటా లు తయారీకి సంబంధించి మేకింగ్ చార్జీలకు టెండర్లు కోరుతున్నట్టు కార్యనిర్వహణాధికారి నోటిఫికేషన్లో కోరారు. ఇదిలా ఉండగా, కిరీటాల తయారీకి నామినేషన్ పద్ధతిలో ఇవ్వనున్నట్టుగా గతనెల 14న ‘నమస్తే తెలంగాణ’లో కథనం ప్రచురితన విషయం విదితమే. దీంతో కిరీటాల్లో ఎవరి వాటాలెంత అంటూ ఇచ్చిన కథనంతో దేవాదాయశాఖలో కలకలం మొదలైంది. రెండు కిరీటాల తయారీని నామినేషన్ పద్ధతిలో చెన్నై కంపెనీకి అప్పగించేందుకు రంగం సిద్ధం చేసిన ముఖ్య అధికారులు వెనక్కు తగ్గారు. కిరీటాల తయారీపై ఓ ప్రత్యేక కమిటీని నియమించారు.
దేవాదాయశాఖ ఆర్జేసీ, కొమురవెల్లి దేవస్థాన ఈవో, ఆ శాఖ జువెల్లరీ వెరిఫికేషన్ ఆఫీసర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, స్థపతిలతో ఏర్పాటు చేసిన కమిటీకి ఈ బాధ్యతలు అప్పగించారు. ఆ ఉత్తర్వుల్లో కొటేషన్లను జత చేస్తున్నామని, దీనిపై నిర్ణయం తీసుకోవాలని కోరడంతో ఈవో మరోసారి సమస్య తేవద్దంటూ కమిషనర్‌ను కలిసినట్టు సమాచారం. ఒక దశలో తాను రాజీనామా చేస్తానని చెప్పినట్టు తెలిసింది. దీంతో ఈ ప్రొక్యూర్మెంట్ టెండర్లు పిలవాలంటూ ఉన్నతాధికారులు ఈవోకు చెప్పారు. నమస్తే తెలంగాణలో కథనం వచ్చిన తర్వాత కిరీటాల్లో వాటాలు కావాలని ఆశించిన ’ప్రధాన’మైన వ్యక్తులంతా ప్రస్తుతం వ్యవహారం చక్కబెట్టడానికి పావులు కదుపుతున్నట్టు తెలుస్తున్నది.